రేషన్‌ మాఫియా నెట్‌వర్క్‌ బ్రేక్‌ డౌన్‌ చేస్తాం

Nov 29,2024 22:09
రేషన్‌ మాఫియా నెట్‌వర్క్‌ బ్రేక్‌ డౌన్‌ చేస్తాం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రేషన్‌ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం, మొత్తం నెట్‌ వర్క్‌ను బ్రేక్‌ డౌన్‌ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కాకినాడ పోర్టును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషన్‌ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలన్నారు. కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం పట్టుబడిన నేపథ్యంలో ఆయన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చేశారన్నారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్ధాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏమిటన్నారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాని చెబుతున్నా క్షేత్ర స్థాయి అధికారులకు ఇంకా అర్థం కాలేదన్నారు. ప్రతిసారీ ప్రజాప్రతినిధులు వస్తేనే చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణాపై రేషన్‌ బియ్యం మాఫియా వెనుక ఉన్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న శక్తులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుతు ఆయన కాకినాడ యాంకరేజ్‌ పోర్టులో రేషన్‌ బియ్యంతో పట్టుబడిన స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రితో నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక బోట్‌లో వెళ్లి పరిశీలించారు. రేషన్‌ బియ్యం తరలించే బార్జీలను తనిఖీలు చేశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్‌లో 1064 టన్నుల బియ్యం సంచులను పరిశీలించారు.

➡️