ఇసక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు అవస్థలు
పెరిగిన ధరతో నిర్మాణదారులకు తప్పని ఇక్కట్లు
ప్రజాశక్తి – రౌతులపూడి : కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితం అనే హామీతో అన్ని వర్గాల లోను సంతోషం వ్యక్తం అయింది అయితే ఆ హామీ ఇసుక రీచ్‌లను దాటకపోవడం గమనార్హం. ఇసుక లభ్యత అంతంత మాత్రంగానే ఉన్న చోట్ల అధిక ధరలు తీవ్ర భారం అవుతున్నాయి. బయట దళారులు టన్నుకు మూడు రెట్లు చొప్పున వసూలు చేసి సొమ్ములు చేసుకుంటున్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాల ఇసుక కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టలేక ఉచిత ఇసుక కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లో నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో కార్మికులకు పనులు దొరకని పరిస్థితి నెలకొంది. మండలంలోని బలరామపురం. రౌతులపూడి. గిడజం. ఎస్ అగ్రహారం. ములగపూడి తదితర గ్రామాల్లో నిర్మాణరంగంపై ఆధారపడి సుమారు 3,000 మంది వరకు కార్మికులు జీవిస్తున్నారు. వీరు గ్రామాల్లో పనులు లేకపోవడంతో పొట్టకూటి కోసం వలస వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఉచిత ఇసుక మాటలు ప్రకటనకే పరిమితం కావడంతో … పని ప్రదేశానికి ఇసుక చేరుకునేందుకు వేలాది రూపాయలు చెల్లించవలసి వస్తుంది. సామాజిక మద్యమాలను ఉచిత ఇసుకపై అనేక విధాలుగా హల్‌చల్ చేస్తున్నారు. గతంలో టన్ను అన్ని ఖర్చులతో 850 రూపాయలకు ప్రతిపాడు నియోజకవర్గానికి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆ టన్ను రవాణా ఖరీదు రూ 1200 పై మాటే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఉచిత ఇసుక హామీని అమలు చేయడంతో పాటు ఇసుక కొరత సమస్యను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికులు, గృహ నిర్మాణ లబ్ధిదారులు కోరుతున్నారు
ఉన్నతాధికారుల స్పందించాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరత తీవ్రమైంది. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కార్మికులు వలస వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పనికి వెళ్తే గాని పుట్ట గడవని కార్మికుల సైతం ప్రస్తుతం ఉన్నారు. వీరిలో కొద్దిమంది కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వద్ద అధిక వడ్డీకి తెచ్చి జీవనం గడుపుతున్నారు. ఇప్పటికైనా ఇసుక రవాణా సక్రమంగా చేపట్టి పనులు కల్పించాలి.
కోటిపల్లి నాగేశ్వరరావు
భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు