పశుగ్రాసానికి తప్పని తిప్పలు

Jan 9,2025 23:01

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక రైతులు యంత్రాల సాయంతోనే వరి కోతలు కోస్తున్నారు. దీంతో ఎండు గడ్డికి తీవ్ర కొరత ఏర్పడింది. మరోవైపు పశుగ్రాస పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో పశువులు పశుగ్రాసం కోసం అల్లాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పాడి రైతులు పశువులకు మేత పెట్టలేక అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.యంత్రాలతో కోతలు తప్పని తిప్పలుపశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం కాకినాడ జిల్లాలో 76,502 ఆవులు, 2,82,273 గేదెలు, 1,01,870 గొర్రెలు, 1,41,229 మేకలు ఉన్నాయి. ఆవులు, గేదెలకు రోజుకు 2 వేల మెట్రిక్‌ టన్నుల ఎండుగడ్డి అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ చివరి దశలో ఉంది. యంత్రాల ద్వారా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. తరచూ వాతావరణంలో వస్తున్న మార్పులు వల్ల రైతులు యంత్రాలను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో పశువులకు ఎండు గడ్డి కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మరోవైపు పంట పొలాలను రొయ్యల, చేపల చెరువులుగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు మార్చేస్తున్నారు. ఈ కారణంగా కూడా పశుగ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. పశుగ్రాస పథకాలు దూరంగత టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఊరూరా పశుగ్రాసం పథకాన్ని వైసిపి ప్రభుత్వం అటకెక్కించింది. ఎకరా కౌలు భూమికి రూ.25 వేలతో పాటు పచ్చగడ్డి పెంచుకోవడానికి, ఎరువులకు మరో రూ.20 వేలు ఇచ్చేవారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ పథకంలో మార్పులు చేసి 25 సెంట్ల భూమి కనిష్టంగా, 2.5 ఎకరాలు గరిష్టంగా సొంత భూమి కలిగి ఉన్న రైతులకు పశు గ్రాసం పెంపకానికి చేయూత ఇవ్వాలని గత ప్రభుత్వం భావించినప్పటికీ ఆచరణకు రాలేదు. దీంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పశువులను పోషించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాడి పశువులకు సబ్సిడీపై లేదా ఫ్యాక్టరీలో తయారీ ధరకు రైతులకు దాణా సరఫరా చేసినప్పటికీ అరకొరగానే ఈ కార్యక్రమం సాగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పాడి పశువులకు దాణా అందించే కార్యక్రమాన్ని అమలు చేసినా రాజకీయ గ్రహణంతో చాలా మందికి అక్కరకు రాకుండా పోయింది. యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేస్తుండడం వల్ల ఎండుగుడ్డికి గడ్డు కాలం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న నేపథ్యంలో పశుగ్రాస పథకాలను తిరిగి పునరుద్ధరించాలని పాడి రైతులు కోరుతున్నారు.పెరిగిన వరి గడ్డి ధరలువరిగడ్డి ధరలు భారీగా పెరిగాయి. ట్రాక్టర్‌ వరిగడ్డి ధర రూ.10 నుంచి రూ.12 వేలకు చేరింది. కొనుగోలుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులు నేరుగా పొలాల్లోనే వరిగడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దీంతో స్థానికంగా గడ్డికి డిమాండ్‌ బాగా పెరిగింది. పశుగ్రాసం కొరత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మేత దొరకడం కష్టంగా మారిందని పలువురు పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️