ప్రభుత్వం తీరుపై వైసిపి యువత పోరు

Mar 12,2025 23:26
ప్రభుత్వం తీరుపై వైసిపి యువత పోరు

ప్రజాశక్తి-కాకినాడ గద్దెనెక్కి 9 నెలలు దాటినా హామీలు అమలు చేయని టిడిపి కూటమి ప్రభుత్వంపై వైసిపి యువత పోరు నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) మాట్లాడుతూ తొమ్మిది నెలల కిందట అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమయ్యిందని దుయ్యబట్టారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, ఉద్యోగ క్యాలెండర్‌ నోటిఫికేషన్‌, మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భతి, డిఎస్‌సి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించి అందులో నాలుగు కాలేజీలను పూర్తి చేశారని, మిగతా వాటిని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడకుండా తమ అనుచరులకు కట్టబెట్టి ఆర్థికంగా లబ్ధి పొందడానికి చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిని ప్రశ్నించకుండా కొంతమంది ఆవిర్భావ సభలు పెట్టుకోవడం శోచనీయమని తెలిపారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎలు ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, వంగా గీత, తోట నరసింహం, ముద్రగడ పద్మనాభం, నాయకులు దవులూరి దొరబాబు, రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. తొలుత కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం వద్ద ఉన్న పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి పెద్ద ఎత్తున కలెక్టర్‌ కార్యాలయానికి బయల్దేరారు. అక్కడ తమ నిరసన తెలిపారు. కలెక్టర్‌ షాన్‌ మోహన్‌కు వినతిపత్రం అందించారు.

➡️