కమనీయం..రమణీయం

Apr 11,2025 22:19

దేశంలోనే రెండో భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి శ్రీసీతారాముల కల్యాణం భక్త జనసందోహం, శ్రీరామ నామస్మరణల మధ్య వైభవంగా జరిగింది. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా స్వామివారి కల్యాణాన్ని పౌర్ణమి పండు వెన్నెల్లో తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, యాత్రికులు, పర్యాటకులు, సేవకులు పెద్దఎత్తున విచ్చేశారు. కడప-చెన్నరు ప్రధాన రహదారికి సమీపంలోని విశాలమైన మైదానంలో ఆకాశమంత చలువ పందిళ్లు వేసి పలు రకాల పూల పరిమళాలు, విద్యుత్‌ కాంతులు, భక్తుల కోలాటాలు, విద్యుత్‌ దీపాలంకారణలతో కూడిన కల్యాణ వేదిక వైకుంఠాన్ని తలపించింది. అంతకు ముందు సీతారాములవారిని ఆలయం నుంచి ఊరేగింపుగా మంగళ వాయిద్యాల నడమ కల్యాణ మండపం వద్ద ఆసీనులను చేశారు. వేదపండితులు ముందుగా ప్రత్యేక పూజలను నిర్వహించి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణ వేదిక ప్రాంగణం నుంచి వీనుల విందుగా సాగిన వ్యాఖ్యానాలు, ప్రవచనాలు ప్రజలను తన్మయులను చేశాయి. కల్యాణ వేదిక ప్రాంగణంలో పలుచోట్ల ఎల్‌ఇడి తెరలను ఏర్పాటు చేసి స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి ఏర్పాటు చేశారు. తమ వంశం గొప్పదంటే తమ వంశమే గొప్పదని కొంత మంది వేద పండితులు సీతమ్మ వైపు, శ్రీరాముల వారి వైపు మరికొందరుచేరి వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాలనడుమ శ్రీసీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులకు కనువిందు చేశాయి.ప్రజాశక్తి-ప్రజాశక్తి ప్రతినిధి/ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జగదభిరాముని కల్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టిటిడి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా కల్యాణ కార్యక్రమాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. తరువాత వారికి ఆలయ విశిష్టత, రాములవారి ప్రాశస్త్య్రం, సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల గురించి వివరించారు. శ్రీసీతారాముల విగ్రహాల శిరములపై జీలకర్ర, బెల్లం పెట్టారు. ఈ మహాద్భుత సన్నివేశాన్ని వేదపండితులు ప్రజానీకానికి చూపించి సీతమ్మ వారి మెడలో మగళసూత్రాన్ని ధరింపజేశారు. ఈ మహాద్బుత దృశ్యాన్ని చూసి తరించేందుకు విచ్చేసిన భక్తులు జైశ్రీరామా అనే రామనామ స్మరణలతో కల్యాణ వేదిక, కోదండరామాలయ పరిసర ప్రాంతమంతా మార్మోగింది. ఏకశిలానగరిలో కోదండరాముడి కల్యాణానికి దేవా దాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, రవాణా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి, టిటిడి చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, టిటిడి ఇఒ శ్యామలరావు, టిటిడి జెఇఒ వీర బ్రహ్మం, టిటిడి బోర్డు మెంబర్లు ఎం.ఎస్‌.రాజు, జ్యోతుల నెహ్రూ, భాను ప్రకాష్‌రెడ్డి, పనబాకలక్ష్మీ, నన్నపనేని సదాశివరావు, శాంతా రామ్‌, తమ్మిశెట్టి జానకిదేవి, సుచిత్ర ఎల్లా, నరేష్‌కుమార్‌, ఎంపీ సిఎం.రమేష్‌, కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్‌పి ఇ.జి.అశోక్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టిడిపి నాయకులు హాజరయ్యారు.భారీగా తరలి వచ్చిన భక్తజనం : సాయంత్రం 5 గంటల నుండి భక్తజనం భారీగా తరలివచ్చారు. ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఎటు చూసిన భక్తులతోనే నిండి ఉంది. సాయంత్రం ఆరు గంటలకే జనంతో నిండిపోయింది. చాలా మంది ప్రాంగణం బయట, హైవే రోడ్డుపై నిలిచి అక్కడ టిటిడి ఏర్పాటు చేసిన ఎల్‌ఇడి స్క్రీన్‌లలో కళ్యాణ ఉత్సవాన్ని తిలకించి తరించారుముత్యాల తలంబ్రాలకు ఎగబడ్డ జనం : స్వామివారి కల్యాణం అనంతరం టిటిడి యంత్రాంగం తలంబ్రాలు పంపిణీ చేసింది.. వీటికోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటర్ల వద్ద జనం ఎగబడ్డారు. ఒక దశలో జనం తలంబ్రాలు పొందేందుకు తోసుకున్నారు. పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.గజ వాహనంపై సీతారాములుఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతా రాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులను కటాక్షించారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ గజ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. ఉదయం శివధను ర్భాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్‌, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామి వారిని దర్శిం చుకున్నారు. కార్యక్ర మంలో ఆలయ డెప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, సూప రింటెండెంట్‌ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ పాల్గొన్నారు.సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు బహూకరణఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలు పెన్నా సిమెంట్స్‌ అధినేత పి.ప్రతాప్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులు విరాళంగా అందించారు. నూతనంగా ఏడు కిలోల బంగారంతో తయారు చేసిన 3 స్వర్ణ కిరీటా లను ఆలయంలోటిటిడి చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఇఒ జెశ్యా మలరావులకు దాత అందించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి, కిరీటాలను సీతారామ లక్ష్మణులకు అలంకరించారు. ఒంటిమిట్టను పర్యాటక హబ్‌గా అభివద్ధి చేస్తాం-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుప్రజాశక్తి-ఒంటిమిట్ట ఒంటమిట్ట దేవాలయాన్ని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీతారామ కల్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరామ రాజ్యాన్ని మళ్లీ స్థాపించాలనే తపన తనదని, ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించాలని ఆకాంక్షించారు. శ్రీరాముడు ఒక వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తండ్రి ఆజ్ఞను ఎలా విధిగా పాటించాలో, కుటుంబ బంధాలను ఎలా పరిపూర్ణంగా పోషించాలో తెలియజేశారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను ప్రధాన పుణ్యక్షేత్రంగా అభివద్ధి చేయడానికి ఈ ఆలయాన్ని దశాబ్ద కాలం క్రితమే టిటిడికి ఇవ్వడమైనదన్నారు. తిరుమల మాదిరిగా ఒంటిమిట్టలో కూడా అన్నప్రసాదం ప్రారంభించాలన్న నిశ్చయాన్ని టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు తీసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఒంటిమిట్టను పుణ్యభూమిగా మార్చేందుకు ఇక్కడి కొండలపై ఆయుర్వేద మొక్కలను నాటనున్నట్టు తెలిపారు. ఒంటిమిట్టను దేవాలయ పర్యాటక హబ్‌గా అభివద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివద్ధి చెంది 2047 నాటికి ప్రపంచంలో నంబర్‌ వన్‌ దేశంగా మారుతుందని చెప్పారు. తర్వాత టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో అన్నప్రసాదం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టిటిడి ఇఒ జె.శ్యామల రావు, కడప జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ప్రజాప్రతినిధులు, బోర్డు సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

➡️