బహిరంగ మార్కెట్‌లో కంది ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈ నెలా కందిపప్పు అందని ద్రాక్షగానే మిగిలింది. పేదింట పప్పు ఉడకడం లేదు. తక్కువ ధరకే చౌక ధరల దుకాణాల్లో అందక కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు మార్కెట్లో కళ్లెం లేని గుర్రంలా పరుగులు తీస్తున్నా అదుపు చేసే వ్యవస్థ లేకపోవడంతో కలవరపడుతున్నారు. ఎందుకా ఈ పరుగు అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తున్నా పాలకుల్లో కాసింతైనా చనలం లేదు. ప్రజాశక్తి-చాపాడు/రాయచోటి వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో 2,362 చౌక ధరల దుకాణాలున్నాయి. ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఎండియు వాహనాలు 676 ఏర్పాటు చేశారు. ఇవి చాలా చోట్ల కదలడం లేదు. పేదలకు చౌక దుకాణాల్లో కంది పప్పు కరువైంది. ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి ఇప్పటి వరకు విడుదల కాలేదు. బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. వైఎస్‌ఆర్ జిల్లాలో 1,239 రేషన్ షాపుల పరిధిలో 5,78,777 కార్డుదారులు, అన్నమయ్య జిల్లాలో 1,123 రేషన్ షాపుల పరిధిలో 4,98,092 మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెలా తెల్లరేషన్ కారుల్డపై బియ్యం ఉచితంగాను, అర కిలో పంచదార రూ.17, కిలో కందిప్పు రూ.70 చొప్పున సబ్సిడీపై పంపిణీ చేస్తున్న సంగతి తెలిసందే. ఇవన్నీ ప్రతి నెలా 1వ తేదీ నాటికే సివిల్ సప్లైరు గోడౌన్లకు చేరేవి. అక్కడి నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా గ్రామాలకు సరుకులు చేరేవి. వ్యానుల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్న విషయం విధితమే. కంది పప్పు విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా కొంత శాతం కోత పెడుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలలో పూర్తిగా కార్డుదారులకు కంది పప్పు సరఫరా కాలేదు. మార్చి నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు ఇప్పటికీ కంది పప్పు చేరలేదు. ఏకంగా కందిపప్పు విడుదల చేయకపోవడంతో పేద, నిరుపేదలు నెలలో ఒక్కపూట కూడా పప్పు అన్నం తినే పరిస్థితి లేదు. కిలో కందిపప్పు ధర బహిరంగ మార్కెట్‌లో రకాన్ని బట్టి రూ.140 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా ఇవ్వలేదని కార్డుదారులు తెలుపుతున్నారు. దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ నెల కందిపప్పు ఇవ్వలేదన్న విషయాన్ని కార్డుదారులంతా చెబుతున్నారు. గత నెలలో బియ్యం సరఫరాలో కొత విధించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో తిరిగి పూర్తి స్థాయిలో పంపిణీ చేశారు. సరుకులు సరిగా ఇవ్వడం లేదన్న ప్రజల వాదనకు తగ్గట్టుగానే రేషన్ సరుకులైన బియ్యం, పంచదార, కందిపప్పు పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక మండలంలో రేషన్ సరుకులు పట్టుబడుతున్నాయి. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండగలకు ప్రత్యేకమైన సరుకులు అందించేవారు. డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన ఈ పండగలకు అటువంటి సరుకులు అందుతాయని భావించినప్పటికీ ఆచరణలో అందలేదు. ప్రస్తుతం రంజాన్ నెలలో కూడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.ఈసారి నెలవారి ఇచ్చే సరుకుల్లోనూ కందిపప్పు కోత పెట్టడంతో తెల్లరేషన్‌కార్డులు విలవిలాడిపోతున్నారు. ఇలా చౌక ధరల దుకాణాల్లో సరుకులు తగ్గించి, ఇచ్చిన వాటిలో కోత విధించడం, ఈనెల ఏకంగా కందిపప్పు సరఫరాకు ఎగనామం పెట్టడంతో పేదలకు ఆర్థిక భారంగా పరిణమించింది.రెండు నెలలుగా కందిపప్పు ఇవ్వడం లేదు రెండు నెలలుగా కందిపప్పు ఇవ్వడం లేదు. జనవరిలో మాత్రం పంపిణీ చేశారు. పిభ్రవరిలో పంపిణీ చేయలేదు. మార్చి నెలకు సంబంధించిన కందిపప్పు ఇంకా రాలేదని రేషన్ విక్రయించే సిబ్బంది చెబుతున్నారు. పప్పు ధర కూడా పెరిగిపోయింది. రూ.140 పెట్టి కొనుగోలు చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. పేదలకు కందిపప్పు కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది.- నాగయ్య, దినసరి కూలీ, గడ్డమాలవాడ, మైదుకూరు.నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టాలి ప్రభుత్వం నిత్యావసర సరుకులను కోత విధించకుండా సరఫరా చేపట్టాలి బియ్యం మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తూ చక్కర కందిపప్పులో కోత విధిస్తున్నారు. కందిపప్పు రెండు నెలలుగా ఇవ్వడం లేదు మార్కెట్లో కందిపప్పు ధర ఆకాశాన్ని అంటుతున్నది ప్రభుత్వం ప్రతినెల రేషన్ సరుకులను పంపిణీ చేపట్టాలి.- లక్ష్మణ్ రావు, వెంకటాపురం, చాపాడు.కంది పప్పు ఇవ్వాలి ప్రభుత్వం పంపించేస్తున్నా రేషన్ బియ్యంతో పాటు గతంలో కంది బేడలు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం కంది బేడలు ఇవ్వడం లేదు. రేషన్ బియ్యం బండి వద్ద వారిని అడిగితే తమకు తెలియదు అని వారు సమాధానం చెబుతున్నారు. రేషన్‌లో ఇచ్చే నిత్యవసర సరుకులను తోనే జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే రేషన్ బియ్యంతో పాటు కంది బేడలు పంపిణీ చేయాలి.- ఎ.రెడ్డయ్య ఎగువ అబ్బవరం, రాయచోటి.బియ్యం ఇచ్చారు..కందిపప్పు ఇవ్వలేదు ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తూ మంచి పని చేస్తుంది. గతంలో బియ్యంతో పాటు చక్కెర, కంది బేడలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్న నేటికీ నిత్యావసరాలతో పాటు కందిబేడలు మాత్రం పేదలకు అందడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు బియ్యంతో పాటు కంది బేడలను ప్రతినెల ఇవ్వాలి.- డి.శంకరమ్మ, రాయచోటి.
