ఉమ్మడి గుంటూరు జిల్లాకు కీలక పదవులు

Nov 13,2024 00:49

జీవీ ఆంజనేయులు, పంచుమర్తి అనురాధ
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి :
శాసన సభలో చీఫ్‌విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, శాసన మండలిలో చీఫ్‌విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. రెండు కీలక పదవులు ఉమ్మడి గుంటూరు జిల్లాకు దక్కడం విశేషం. నామినేటెడ్‌ పదవుల పందేరంలో భాగంగా రెండు ఒకే జిల్లాకు రావడంపై ఇతర ప్రాంతాలకు చెరదిన నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. శాసన సభలో చీఫ్‌ విప్‌ పదవి పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా అనూహ్యంగా జి.వి. ఆంజనేయులుకు ఈ పదవి దక్కింది. పల్నాడు ప్రాంతానికి మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో ఈ ప్రాంతంలో కొంత అసంతృప్తి ఉందనే వార్తల నేపథ్యంలో జి.వి.ఆంజనేయులుకు పదవిని కట్టబెట్టారు. 2004లో రాజకీయ అరంగేట్రం చేసిన జి.వి.ఆంజనేయులు తొలిసారిగా క్యాబినెట్‌ హోదా కలిగిన పదవిని పొందారు. 2004లో ఆంజనేయులు భార్య లీలావతికి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆమె అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కెన మల్లిఖార్జునరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో జి.వి.ఆంజనే యులకు టిడిపి నుంచి పోటీ చేసి వినుకొండ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడిపోయినా తిరిగి 2024లో భారీ మెజార్టీలో గెలుపొందారు. 2023లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలిచారు. టిడిపికి తగినంత బలం లేకపోయినా వైసిపి నుంచి జరిగిన క్రాస్‌ ఓటింగ్‌ ఫలితంగా ఆమె ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. అంతేగాక గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్‌ విజయం కోసం ఆమె కృషి చేశారు. రెండు చీఫ్‌ విప్‌లు ఒకే ప్రాంతానికి కేటాయించడం ద్వారా రాజధాని ప్రాంతంలో పదవులు ఎక్కువగా దక్కుతున్నాయని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర మంత్రిగా ఉన్నారు. నారా లోకేష్‌, నాదెండ్ల మనోహర్‌, అనగాని సత్యప్రసాద్‌ మంత్రులుగా ఉన్నారు. ఇదే సమయంలో జిల్లాలో అత్యంత సీనియర్‌ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, దూళిపాళ్ల నరేంద్రకు కూడా కీలక పదవులు వస్తాయని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. సామాజిక సమీకరణలో కన్నాకు అవకాశం రాలేదంటున్నారు. పొన్నూరు నుంచి 1995 నుంచి 2014 వరకు ఐదుసార్లు వరసగా గెలిచిన నరేంద్ర 2019లో ఓడిపోయారు. 2024 నుంచి తిరిగి ఆరోసారి గెలిచారు. మంత్రి పదవి ఆశించినా కోరిక నెరవేరలేదు. బిజెపి నుంచి టిడిపిలో చేరిన కన్నాకు కూడా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగినా ఆయనకూ అవకాశం దక్కలేదు.

➡️