కార్మికులు, కర్షకుల జోలికొస్తే ఖబడ్దార్‌

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ కార్మిక, ఉద్యోగ, కర్షకుల హక్కులు, చట్టాల జోలికి కేంద్ర ప్రభుత్వం వస్తే ఖబడ్దార్‌ అని ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు అధ్యక్షతన ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఆందోళనకు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారం లోకి వచ్చిన బిజెపి కార్మిక, ఉద్యోగ, కర్షకుల పట్ల వినాశకర విధానాలు తీసుకొస్తూ కేవలం కార్పొరేట్లకు లాభాలు కోసమే ఊడిగం చేస్తుందని పేర్కొన్నారు. అందుకే రూ.15 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని తెలిపారు. కార్మికులకు నష్టం తెచ్చే నాలుగు లేబర్‌ కోడ్లు తెస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో మూడు నల్ల చట్టాలను రైతులు ఏడాది పాటు పోరాడి రద్దు చేసుకున్నారని, వాటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేంతరవకు పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. ధరలు రూ.300 రెట్లు పెరిగినా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించాలని, ఉపాధి పథకం పటిష్టంగా అమలుచే యాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు రక్షణ కోసం పాటుపడాలని, స్కీమ్‌ వర్కర్స్‌ జీతాలు పెంచాలని, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధికరణ చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలని, మహిళల రక్ష కై ప్రత్యేక చట్టాలు అమలు పరచాలని, ప్రజా పంపిణీ పథకం సమగ్రంగా అమలు చేయాలని నిరుద్యోగ సమస్యకు పరిశ్రమలు నెలకొల్పాలని తెలిపారు. వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని కార్మి కులు, ఉద్యోగులు ప్రజలు చేస్తున్న ఐక్య ఉద్యమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు నివరించాలన్నారు విద్యుత్‌ ట్రూ ఆఫ్‌ ఛార్జీల భారం విరమించుకోవాలని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోక కష్ణప్ప మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం కింద 200 రోజుల పాటు పనులు చేయించాలన్నారు. ప్రతి కూలీ రోజుకు రూ.600 చొప్పున కూలి చెల్లిం చాలని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి టి.హరిశర్మ మాట్లాడుతూ కార్పొరేట్ల సేవలో ఉన్న కేంద్రానికి బుద్ది చెప్పటానికి సంఘలకతీతంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మణి, సిఐటియు జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి, చిట్వేలి రవికుమార్‌, ఎస్‌.శ్రీలక్ష్మి, ఎస్‌.సురేంద్ర, ఎస్‌.మెహరున్నసా, ఎపిఎం డి.సి.శ్రీనివాసులు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి గంగాధర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎపి గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్‌ నాయక్‌, ఎఐటియుసి, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ళ శ్రీనివాసులు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నేలపాటి శ్రీనివాసులు కార్యదర్శి సురేష్‌ కుమార్‌, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి నాగేశ్వరి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలీం బాషా, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వేణు గోపాల్‌రెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ పాల్గొన్నారు.

➡️