జిల్లాకు చేరుకుంటున్న విద్యార్దులు కిట్లు

Jun 11,2024 15:05 #schools, #vijayanagaram
  • పంపిణీకి సిద్దం చేస్తున్న విద్యా శాఖ సిబ్బంది

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈ నెల 13న గురువారం నుంచి బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన అన్నింటినీ అందజేసేందుకు జిల్లా విద్యాశాఖ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని 1642 స్కూళ్లకు సంబంధించి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆ స్కూళ్ల నుంచి 9.15 లక్షల పాఠ్య పుస్తకాలు ఇండెంట్ ఉండగా 63 శాతం ఇప్పటికే జిల్లాకు రావడం జరిగింది,వచ్చినవి ఆయా మండలాలకు పంపిణి చేయడం జరిగింది. పాఠశాలలకు వాటి పంపిణీ జరిగినట్లు జిల్లా అధికారులు తెలియచేశారు. జగనన్న విద్యా కానుక (జెవికె) పేరున స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు, బ్యాగులు గడచిన ఐదేళ్లలో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో విద్యా కానుక కిట్లకు బదులుగా ‘స్టూడెంట్ కిట్’లుగా పేరు మార్చి స్కూలు బ్యాగులపై గతంలో ఉండే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటో కూడా తీసివేశారు. ఈ కిట్లలో ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉంచి స్కూళ్ల వారీగా కేటాయించి పంపిణీ చేశారు. అన్ని స్కూళ్లన్నింటికీ బెల్టులు, షూలు కిట్లు పంపిణి చేయడం జరిగింది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలాల్లో స్టూడెంట్ కిట్లును సమగ్ర శిక్ష సిబ్బందితో మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ఇప్పటికే చేరవేసే కార్యక్రమం విద్యాశాఖ చేపట్టింది.

పాఠశాలల్లో విద్యార్థులు ఇలా..

జిల్లాలో ఉన్న 27 మండలాలకు విద్యాశాఖా పరిధిలో 1642 ప్రభుత్వ స్కూళ్ళలో బాలురు 66604 మంది,బాలికలు73875 మంది మొత్తంగా ప్రభుత్వ బడుల్లో 1,41,479 మంది విద్యార్థులు చదువుతున్నారు.అన్ని చోట్ల విద్యార్థులందరికీ సక్రమంగా కిట్లు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నేటికీ జిల్లాకు చేరుకొని యూని ఫారాలు..

విద్యార్థి కిట్లులో ఉండాల్సిన ఐటమ్స్ లో నోట్ పుస్తకాలు 98.5 శాతం,బ్యాగ్ లు 71.5 శాతం,బెల్టులు 99.5శాతం, షూలు 26 శాతం, యునిఫారాలు పూర్తిగా నేటి వరకు చేరుకోలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో విద్యార్ది కిట్లు నూతన ఎమ్మేల్యేలు చేత పండగ వాతావరణంలో పంపిణి చేసేందుకు అధికార యంత్రాంగం చూస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో కిట్లు అన్ని సిద్దం చేసి విద్యా సంస్థలు ప్రారంభం అయిన తర్వాత పంపిణీకి సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆయా మండలాలకు ఎన్ని కిట్లు,విద్యార్దులు సంఖ్య వాటి వివరాలు ఎమ్మెల్యేలకు విద్యా శాఖా అధికారులు పంపించే పనిలో నిమగ్నమై ఉన్నారు.

➡️