చట్టాలపై అవగాహన అవసరం

ప్రజాశక్తి-భట్టిప్రోలు:  చట్టాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని రేపల్లె సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.వెంకటేశ్వరరావు అన్నారు. భట్టిప్రోలు పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం మహిళ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. భట్టిప్రోలు పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యాయమూర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు చట్టంలో అనేక నూతన సెక్షలను పొందుపరచడం జరిగిందన్నారు. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యాచార ఘటన పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా చట్టాలపై అవగాహన పెంచుకొని, నిర్భయంగా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులకు పోలీసులు కేసు తీసుకోకపోతే దానిపై అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా కూడా కేసు నమోదు చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా నిరుపేదలకు జరిగిన అన్యాయంపై కోర్టులో వాదించుకొనే న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉంటే అట్టివారికి మండల లీగల్‌ సెల్‌ ద్వారా ఫిర్యాదు చేస్తే ఉచితంగా న్యాయవాదిని కేటాయించి ఉచిత న్యాయ సహాయాన్ని పొందేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ఈ మండల లీగల్‌ సెల్‌ చైర్మన్‌గా న్యాయమూర్తి ఉంటారని వారికి ఫిర్యాదు చేస్తే సత్వర న్యాయ పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ధార రవి కిరణ్మయి, తహశీల్దార్‌ మేక శ్రీనివాసరావు, మండల పరిపాలన అధికారి సిహెచ్‌ జలజ, సీనియర్‌ న్యాయవాదులు షేక్‌ అమీనా రహమాన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️