ప్రజాశక్తి – ఆదోని : పరిస్థితులకు పరిష్కారం దొరక్క చాలామంది నష్టపోతున్నారని ప్రస్తుత తరుణంలో చట్టాలపై అవగాహన కలిగి ఉంటే న్యాయం పొందవచ్చని అడ్వకేట్ లలిత తెలిపారు. ఆదోని ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సైబర్ నేరాలు – చట్టాలు అనే అంశం పై ప్రిన్సిపాల్ మురళీ మోహన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ లలిత చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఐటి చట్టం, ఐపిసి, ఎన్ సి ఆర్ పి చట్టాలలో ఉన్న అంశాలను క్లుప్తంగా వివరించారు ఎవరైనా ఫేక్ కాల్స్ చేసి బెదిరించే సమయంలో భయపడకుండా సైబర్ క్రైమ్ డిపార్టుమెంటుకు ఫిర్యాదు చేయాలని, లేని పక్షంలో ఎన్ సి ఆర్ పిజాతీయ సైబర్ క్రైమ్ రిజిస్టరింగ్ పోర్టల్ కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అక్కడి నుండి తగిన పరిష్కారం లభిస్తుందన్నారు. నేటి కాలంలో తెలియని లింక్ లను మొబైల్లో క్లిక్ చేయటం ద్వారా అనేక మంది డబ్బును పోగొట్టుకొని మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చావు పరిష్కారం కాదని సైబర్ క్రైమ్ బ్రాంచ్ ను ఆశ్రయించటం ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. చదువుకో లేని తల్లిదండ్రులకు విద్యార్థులు చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ అధికారులు జోనాథన్ విక్లీఫ్, ఉమాదేవి, వెంకట్రామి రెడ్డి, మధు, వెంకటేశ్వర్లు, సంతోషి విద్యార్థులు పాల్గొన్నారు.