ఎన్‌టిఆర్ : పింఛన్ల పంపిణీ పండుగలా ప్రారంభమైంది. వేకువ జామునే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళిన వివిధ శాఖల సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పింఛన్ల సొమ్ము అందించడంతో లబ్ధిదారుల మోములో ఆనందం వెల్లివిరిసింది. కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు శనివారం ఉదయాన్నే కంచికచర్ల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోగంటి బాబు మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడంలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు. డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదని ఈ నెల 30నే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సామాజిక భద్రతను పెంచే ఉద్దేశంతో పెన్షన్ల పంపిణీని మరింత సరళీకఅతం చేసిందన్నారు. వివిధ కారణాల వల్ల రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు చంద్రబాబు అవకాశం కల్పించారన్నారు. ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే అతని భార్య మరుసటి నెల నుంచే స్పౌస్ పెన్షన్ (వితంతు పెన్షన్) పొందేలా వీలుకల్పించినట్లు వివరించారు. గత అనుభవాలను దఅష్టిలో ఉంచుకొని ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే వెంటనే సరిదిద్ది పెన్షన్ల పంపిణీని కార్యక్రమం సజావుగా పూర్తి చేయాలని వివిధ శాఖల సిబ్బందిని, కార్యకర్తలను కోరారు. మండలంలో వివిధ గ్రామాల్లో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని కోగంటి ఈ సందర్భంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమా వెంకట్రావు, బాజీ ఖాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.