ఉపాధ్యాయులకు ఆదర్శం కొమ్మారెడ్డి కేశవరెడ్డి

Nov 30,2024 00:42

కేశవరెడ్డి జీవితంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఓల్గా, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
ఉపాధ్యాయుడిగా, ఉద్యమ నాయకుడిగానే కాకుండా సాహితీవేత్తగా విశేష సేవలందించిన కొమ్మారెడ్డి కేశవరెడ్డి ఉపాధ్యాయులకు ఆదర్శమని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల్లోని విజ్ఞానంతోపాటు, సామాజిక అంశాలనూ అధ్యయనం చేయాలన్నారు. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో కేశవరెడ్డి సాహిత్య పురస్కార సభ యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు యు.రాజశేఖర్‌రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేశవరెడ్డి సాహితీ పురస్కారం-2024ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సాహితీవేత్తల ద్వారా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేశవరెడ్డి గణిత ఉపాధ్యాయుడైనా సాహితీవేత్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ముఖ్యంగా అనువాద రచయితగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎరిక్‌ ఆక్స్‌పామ్‌ వంటి ప్రపంచ స్థాయి రచనతోపాటు, చరిత్రపై ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ రాసిన పుస్తకాన్ని కొమ్మారెడ్డి తెలుగులోకి అనువదించారని తెలిపారు. సాహితీవేత్త రావెల సాంబశివరావు మాట్లాడుతూ కేశవరెడ్డి సాహితీ పురస్కారం ఓల్గాకు ఇవ్వటం ముదాహవమన్నారు. రిటైర్డ్‌ అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ కొమ్మారెడ్డి సున్నిత మనస్తత్వం కలవారని, ఆయన రచనలు ఎంత గొప్పవో, ఆయన వ్యక్తిత్వం అంత గొప్పదని అన్నారు. ఆయన సాహిత్య రచనకు గోర్కి నవల ‘నగరం’ ప్రేరణని తెలిపారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఓల్గా వంటి వారు సాహిత్య రచన చేస్తున్నారని కొనియాడారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యాజీ మాట్లాడుతూ కేశవరెడ్డి సాహిత్య రంగానికి ఎంతో కృషి చేశారని, సాహితీ స్రవంతి ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించారన్నారు. కేశవరెడ్డి ఆశయాన్ని కుటుంబం పంచుకొని, ప్రతి ఏటా సాహిత్య పురస్కాలు ఇవ్వటం అభినందనీయమని అన్నారు. తెలుగు సాహిత్యంలో భావజాల రంగంలో ఒక మలుపు ఓల్గా సాహిత్యం అని, ప్రతిఘటనను కూడా చాలా సున్నితమైన పదాలతో చెప్పటం ఆమె ప్రత్యేకతని చెప్పారు. ప్రజాశక్తి బుకహేౌస్‌ జిఎం లక్ష్మయ్య మాట్లాడుతూ కేవశరెడ్డి చివరిశ్వాస వరకూ సాహిత్య కృషి చేశారన్నారు. కేశవరెడ్డితోపాటు, ఓల్గాకు ప్రజాశక్తితో ఎంతో అనుబంధం ఉందన్నారు. సాహిత్య రంగంలో ఉన్న అన్ని ప్రక్రియల్లోనూ ఓల్గా రచనలు ఉన్నాయని, ఇప్పటి దాకా దాదాపు 80 పుస్తకాలు రచించారని తెలిపారు. పురస్కార గ్రహీత ఓల్గా మాట్లాడుతూ ఆమె బాల్యం, విద్యాభాస్యం, విద్యార్థి ఉద్యమంతో గుంటూరు జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేశవరెడ్డి అనువాద రచనలు చాలా గొప్పవని, అందులో ఎరిక్సన్‌ అనువాదం అసాధారణమైనదని చెప్పారు. సాహిత్య రచనకు, అనువాద సాహిత్యానికి తెలుగులో సమ ప్రాధాన్యత ఉందని, ఒకోకసారి అనువాద సాహిత్యమే ఎక్కువగా ఉందా? అనే భావన కలుగుతుందన్నారు. అనువాద సాహిత్యాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తక పఠనం అలవాటును పెంచటానికి కొమ్మారెడ్డి ఆశయ సాధకులు, సాహితీ సంస్థలు కృషి చేయాలని కోరారు. అనంతరం ఓల్గాకు కేశవరెడ్డి సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. శాలువా, రూ.25 వేల నగదు పురస్కారం, ప్రశంసాపత్రంతో ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి జీవితంపై రూపొందించిన పుస్తకాన్ని ఓల్గా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రజానాట్య మండలి సీనియర్‌ నాయకులు నూతలపాటి కాళిదాసు, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌, కేశవరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️