ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్ష

Feb 9,2024 22:40

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్‌ వారి ఛాంబర్‌ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కచ్చితత్వంతో కూడిన ఓటరు జాబితా రూపకల్పనకై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని ధులు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఓటర్ల జాబితా లోని లోపాలను రాజకీయ పార్టీలు ప్రతినిధులు గుర్తించి తమ దష్టికి తీసుకువచ్చినట్లయితే ఈ నెల 20 లోగా చేర్పులు మార్పులు చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు తదుపరి మార్చి 5న నివేదికను రూపొందిస్తారన్నారు. మరణించిన ఓటర్ల విషయంలో తప్పనిసరిగా మరణ ధ్రువపత్రాన్ని సమర్పించిన యెడల నోటీస్‌ అందించి ఓటు తొలగించడం జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సందేహాలను ఆయన సందర్భంగా నివత్తి చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఉన్న రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలో తీసుకొని తగు చర్యలు చేపడతామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిం చడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.జిల్లాలో పోలింగ్‌ శాతాన్ని పెంచే దిశగా స్వీప్‌ కార్య క్రమాలను నిర్వహిస్తూ ఓటు హక్కు ప్రాముఖ్యత, విలువ వినియోగం పై అవగాహన కార్యక్రమాలను ఏర్పా టు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమాలలో కూడా రాజకీయా పార్టీల ప్రతినిధులు భాగస్వామ్యంవహించి జిల్లాలో ఓటింగ్‌ శాతం పెరిగేలా తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌.సత్తిబాబు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దూరి రాజేష్‌, వైసిపి ప్రతినిధి సంసాని నాని, టిడిపి తరఫున అల్లాడి స్వామి నాయుడు సిపిఎం తరపున కారెం వెంకటేశ్వరరావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున పి.పవన్‌ సురేష్‌, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

➡️