టిడ్కో ఇళ్లు అప్పగించకుండానే వడ్డీలా..

Feb 12,2024 22:26
టిడ్కో ఇళ్లు అప్పగించకుండానే వడ్డీలా..

ప్రజాశక్తి-మండపేటటిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అప్పగించకుండానే బ్యాంకు వడ్డీ ఎందుకు కట్టాలని ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద వడ్డీ కట్టాలంటూ బ్యాంకు నోటీసులు వచ్చిన లబ్ధిదారులతో కలసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో లబ్ధిదారులు ప్లాట్లు స్వాధీనం చేసుకునే వరకు వడ్డీ కట్టక్కరలేదని ఎంఎల్‌సి ఇచ్చిన హామీ నిలబెట్టు కోవాలన్నారు. గత ఏడు సంవత్సరాల క్రితం ప్లాట్ల కోసం రూ.లక్ష చెల్లించినప్పటికీ నేటికీ ఇళ్లు అప్పగించకుండా లబ్ధిదారులను ముప్పతిప్పలు పెడుతున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మొదటి ఫేజ్‌లో 4,064 ఇళ్లు 95 శాతం పూర్తి చేసామని మిగిలిన 5 శాతం పనులు ఐదేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తి చెయ్యలేక పోవడం దారుణమన్నారు. ఈ టిడ్కో ఫ్లాట్లు తనఖా పెట్టి రూ.కోట్లలో బ్యాంకుల నుండి తీసుకున్న ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి పోయిందని ప్రశ్నించారు. టిడ్కో ఫ్లాట్లకు పార్టీ రంగులు వేసుకోవడంలో చూపిన శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో లేదన్నారు. కమిషనర్‌ ఇచ్చిన హామీ మేరకు మిగిలిన ఫ్లాట్లను వారం రోజుల్లో అప్పగించి బ్యాంకు రుణాల వడ్డీ ప్రభుత్వమే భరించాలని లేదా మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్ల నుంచి ఇల్లు ఇవ్వకుండా తిప్పుతున్నారని, వడ్డీలు కట్టాలని బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని వడ్డీలు కట్టలేమని వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబులు, టిడిపి నాయకులు గుండు వీరతాత రాజు, కొవ్వాడ అప్పన్నబాబు, కౌన్సిలర్‌ యరమాటి గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️