తాగునీటి సమస్యల నివారణకు చర్యలు

Apr 1,2024 23:05
తాగునీటి సమస్యల నివారణకు చర్యలు

ప్రజాశక్తి-అమలాపురంవేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా వేసవి కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సంబంధిత గ్రామీణ తాగునీటి సరఫరా మున్సిపల్‌ శాఖలను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి 26 జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం ద్వారా సరాసరి వేతనాల చెల్లింపు, సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అంశాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రానున్న జూన్‌ నెలాఖరు వరకూ ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని వేసవి స్టోరేజ్‌ ట్యాంకులను తాగునీటి రిజర్వాయర్లను కాలువలు మూసివేసేలాగా పూర్తిగా నింపుకో వాలన్నారు. మున్సిపల్‌ నీటి సరఫరా గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాల దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందు బాటులోకి తేవాలని అధికారులకు స్పష్టం చేశారు. వివిధ తాగునీటి పధకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రానున్న మూడు నెలల్లో తాగునీటి ఎద్దడిగల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ మంచినీటి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి డిమాండ్‌కు అనుగుణంగా ట్యాంకర్ల నీటి నిర్వహణ వ్యవస్థలు, పంపింగ్‌ ద్వారా తాగునీరు సరఫరా అయ్యే విధంగా వేసవి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి పటిష్టంగా అమలు చేయాలన్నారు. సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చర్యలపై సమీక్షించి పంపిణీ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతాల్లో వడ గాల్పులు ఎండ తీవ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయట తిరగరాదని సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్కరూ ఆచరించి సురక్షితంగా జీవించాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పనులు నిర్వహించే చోట వేతన జీవులకు టెంట్లు వేసి వేసవి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తూ గరిష్ట వేతనాలు పొందే విధంగా ఒక కుటుంబానికి వంద రోజులు పని దినాలు కల్పించాలని సూచించారు నరేగా ద్వారా వంటకాలువల్లో గుర్రపు డెక్క, పూడికతీత పనులు, నీటి సంరక్షణ, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు అభివద్ధి, తదితర పనులను చేపడుతూ రైతులకు ప్రజానీకానికి మేలు చేకూర్చాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ సిహెచ్‌.ఎన్‌వి.కృష్ణారెడ్డి, డ్వామా పీడీ ఎస్‌ మధుసూదన్‌, డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, సిపిఒ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర తదితరులు పాల్గొన్నారు.

➡️