బాలుని వైద్యానికి ఆర్థిక సాయం

Feb 11,2024 22:16

బాలుని కుటుంబ సభ్యులకు సాయం అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి-రాజోలు

రెండు కిడ్నీలు పాడయిపోయి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన బాలుడు బళ్ల రామ్‌ యోచన్‌కు మొగలికుదురు జెడ్‌పి ఉన్నత పాఠశాల (1995-96) టెన్త్‌ బ్యాచ్‌ విద్యార్థులు 1.50 లక్షల సాయం ఆదివారం అందజేశారు. వీరంతా 30 సంవత్సరాల తర్వాత కొందరు స్నేహితులు ద్వారా ఫోన్‌ నెంబర్లు సేకరించి వాట్సాప్‌ గ్రూప్‌ గా ఏర్పడి ప్రతి ఏడాది గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసుకోవాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈక్రమంలో నగరం ఎడ్యుకేర్‌ స్కూల్‌ నందు 8వ తరగతి చదువుతున్న విద్యార్థి బళ్ళ రామ్‌ యోచన్‌కు రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యి కాకినాడ ఆసుపత్రిలో డయాలసిస్‌ పొందుతున్నాడని కోళ్ల నవ్య సాయిశ్రీ అనే ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థిని పెట్టిన పోస్టు గ్రూప్‌ సభ్యుల దృష్టికి వచ్చింది. ఫిబ్రవరి 15 లోపు బాలునికి కిడ్నీ ట్రాన్స్‌ ఫ్లాంటేషన్‌ చేయాలని అందుకు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బాలుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన పూర్వ విద్యార్థులు బొక్కా శ్రీను, మామిడి సూర్య భగవాన్‌, అలీ అబ్బాస్‌ చొరవతో స్నేహితులు అంతా కలసి బాలుని వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1లక్షా 50 వేల విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని పొన్నమండ గ్రామం వెళ్లి రామ్‌ యోచన్‌ కుటుంబానికి అందిచారు. ఈ సందర్భంగా పలువురు గ్రూప్‌ సభ్యులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు, ఆపదలో ఉన్న వారి కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ముఫ్పై ఏళ్ల తర్వాత గ్రూపు సభ్యులుగా ఏర్పడి తొలి అడుగు సేవా కార్యక్రమంతో ప్రారం భించిన వీరిని బాలుని కుటుంబసభ్యులు ,గ్రామ పెద్దలు, ఎడ్యుకేర్‌ విద్యా సంస్థల యాజమాన్యం అభినందించారు.

 

➡️