రహదారి భద్రతపై అవగాహన

Feb 13,2024 16:32

జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌

ప్రజాశక్తి-అమలాపురం

జాతీయ భద్రత మాసోత్సవాలలో భాగంగా స్థానిక నల్ల వంతెన వద్ద నుంచి గడియారపు స్తంభం వరకు వాకాన్‌ ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రత నినాదాలు చేస్తూ అవగాహన పెంపొందించారు. ముందుగా ఈ ర్యాలీని నల్ల వంతెన వద్ద జిల్లా ఎస్‌పి ఎస్‌. శ్రీధర్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రతకు నిబంధనలు తప్పని సరిగా పాటించాలన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రాణాలను కాపాడుకునే దిశగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. రోడ్డుకు కుడి వైపున నడవాలని,రోడ్డు దాటేందుకు పాదచారుల క్రాసింగ్‌ లైన్ల మీదనే రోడ్డు దాటాలన్నారు. రోడ్డు దాటి ముందు రెండు వైపులా వాహన రాకపోకలను పరిశీలన చేసుకుని రాకపోకలు లేని సందర్భంలోనే రోడ్డు దాటాలన్నారు. రోడ్లపై ఆటలు ఆడవద్దని, నిద్ర వచ్చినట్టు అనిపించినా లేదా అలసటగా అనిపించినా డ్రైవింగ్‌ ఆపివేయాలన్నారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ వాడరాదని సూచించారు. అధిక వేగం నివారించాలన్నారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు మద్యం తాగవద్దన్నారు. ద్విచక్ర వాహనంపై పయనించేవారు హెల్మెట్‌, నాలుగు చక్రాల వాహనంలో పయనించేవారు సీట్‌ బెల్టులు తప్పని సరిగా ధరించాలన్నారు. జీబ్రా క్రాసింగ్‌ దగ్గర పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కారు నడిపే వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తి సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం తప్పనిసరన్నారు. వాహన చోదకులు వేగ పరిమితులను రోడ్ల పై ఎల్లప్పుడూ పాటించా లన్నారు. కారును నిర్దేశిత పార్కింగ్‌ ప్రదేశంలో మాత్రమే నిలిపి ఉండాల న్నారు. మలుపులు తీసుకునేటప్పుడు ప్రమాదాలను నివారించడానికి ఎల్లప్పుడూ సిగల్‌ ఇస్తూ, నెమ్మదిగా వెళ్లాలని, క్రమం తప్పకుండా కారు, ఇతర వాహనాలను మెయింటెయినెన్స్‌ చేయాలన్నారు. జిల్లా రవాణా అధికారి డి.అశోక్‌ ప్రతాప్‌ రావు మాట్లాడుతూ సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఆటో డ్రైవర్లతో ఈ ర్యాలీ నిర్వహించి రహదారి భద్రత పై నినాదాలు చేస్తూ గడియారపు స్తంభం వరకు నిర్వహించామన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఓవర్‌ లోడింగ్‌ తదితర అంశాలపై అవగాహన పెంపొందిస్తూ ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, హెచ్‌ఎంలు, స్థానిక ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

 

➡️