ఉపాధి కూలి రూ.300 చెల్లించాలి

Jun 11,2024 22:46
ఉపాధి కూలి రూ.300 చెల్లించాలి

ప్రజాశక్తి – రాజోలుఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కనీసం రూ.300 కూలి చెల్లించాలని, రెండు పూటల మస్తర్లు రద్దు చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని కడలి, బి.సావరం, ములిగిపల్లి గ్రామాల్లో ఉపాధి కూలీలతో వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఉదయం మస్తర్‌ వేసి నాలుగు గంటల తర్వాత మరో మస్తర్‌ వేయడం వల్ల ఈ వేసవికాలం ఎండలు తీవ్రత వల్ల ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రెండోసారి మస్తరు వేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వారం రోజులుగా జిల్లాలోని ఐ.పోలవరం ముమ్మిడివరం, అమలాపురం, అంబాజీపేట, కాట్రేనికోన, రాజోలు తదితరు మండలాల్లో పని ప్రదేశాల్లో ఏ సదుపాయాలూ లేవని, ఏ గ్రామంలోనూ మెడికల్‌ కిట్లు, టెంట్లు సరఫరా చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తూ కూలీలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేస్తోందని వాపోయారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి రూ.రెండున్నర లక్షల కోట్లు కేవలం రూ.70 వేల కోట్లు మాత్రమే కేటాయించడం హాస్యాస్పదం అన్నారు. వేలకోట్లను అంబానీ, అదానీల కంపెనీలకు దోచి పెడుతున్న కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట కొట్టిందన్నారు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదనాన్రు. కనీసం రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 200 రోజుల పని దినాలను పెంచి రూ.600 కనీస వేతనం అమలు చేయాలన్నారు. పేస్లిప్పులు ఇవ్వాలని, మజ్జిగ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చట్టం ప్రకారం జీతం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాడి శ్రీరామ్మూర్తి, జిల్లా నాయకులు పొలమూరి శ్రీనివాస్‌, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బుంగ సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️