ప్రజాశక్తి-అమలాపురం ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువ, ఎగువ భాగాలలో రెండు కిలో మీటర్ల రొయ్య పిల్లల విత్తనం (సీడ్) సేకరణ లీజుకు సంబంధించి ధవళేశ్వరం, బొబ్బర్లంక మత్స్యకార సహకార సంఘాల మధ్య నెల కొన్న వివాదం పరిష్కార దిశగా ఇరు జిల్లాల మత్స్య శాఖ జలవనుల శాఖల అధికారులు సమగ్రంగా విచారించి చట్టబద్ధంగా ఇరు సంఘాల ఆమోదంతో వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం మత్స్యకార సంఘాలతో రెండు జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంఘాల పూర్వా పరాలను, వివాదాలు నెలకొనడానికి గల కారణాలను ఇరు సంఘాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదేళ్లుగా ఇరు సంఘాలు రొయ్య పిల్లలు సేకరణ ద్వారా పొందుతున్న ఆదాయం, ఎంత మంది జీవనోపాధి వస్తోంది వంటి గణాంకాలను రూపొందించి తదనుగుణంగా ఇరు సంఘాలకు ఆమోదయోగ్యమైన చట్టబద్ధమైన పరిష్కార మార్గాన్ని సూచించాలన్నారు. వివాదాలు నెల కొనడానికి గల కారణాల ఆధారంగా పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తూ ఆమోద యోగ్యమైన చర్యలు చేపట్టాలన్నారు. రొయ్య పిల్లల విత్తన సేకరణకు అద్దెకు ప్రతిపాదించిన గేట్లు లీజులు సరిహద్దు వివాదానికి చర్యలు చేపడుతూ ఇరు సంఘాలకు ఆమోదయోగ్యంగా రొయ్య పిల్లల సేకరణకై ఒక సమగ్ర విధానాన్ని రూపకల్పన చేయాలన్నారు. గోదావరి బ్యారేజ్ వద్ద లభించే రొయ్య పిల్లలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఆరోగ్య పరంగా కూడా మంచి పోషకాలు గల ఆహారమన్నారు. జెప్రాన్ (రొయ్య పిల్లల) కలెక్షన్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మాత్రమే జరుగుతుందని తెలిపారు. మ్యాపులు రూపకల్పనలో కూడా ఇరు జిల్లాలలో చాలా వ్యత్యాసాలు స్పష్టంగా కనపడుతున్నాయని వీటిపై కూడా పున్ణ పరిశీలన చేసి కచ్చితంగా రూపొందించాలని ఆదేశించారు. సుదీర్ఘకాలంగా నెలకొన్న సంఘాల సమస్యలకు త్వరితగతిన సమగ్రమైన విధానాన్ని రూపొందించి ఇరు సంఘాలు జీవనోపాదులకు ఆమోదయోగ్య మైన చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలలన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి హెడ్ వర్క్స్ ఇఇ ఆర్.కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి వి.కృష్ణారావు, కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు కె.ప్రభాకర్ మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఇమ్మాన్యుయేల్ పాల్గొన్నారు.
