అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతం

Feb 3,2025 22:46

ప్రజాశక్తి-రాజోలు దేశంలో ప్రసిద్ధమైన అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం విలువైన భూములు, ఖరీదైన ఆస్తులు కలిగి ఉంది. అయినా ఆలయంలో ఏటా స్వామి వారి కల్యాణానికి చందాల ఎత్తాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది.., ఆలయ పరిసరాల్లోనే ఆక్వా సాగు యథేచ్ఛగా సాగుతున్నా ఎందుకు పట్టడం లేదు.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పల్లవ రాజులు క్రీస్తు శకం 5వ శతాబ్ధంలో ఆలయాన్ని నిర్మించినట్టు స్థానికులు చెబుతునానరు. 2004లో ఆలయ ఆధునికీకరణ పనులను అప్పటి సిఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. నవ నారసింహ క్షేత్రాలలో అంతర్వేది ఒకటిగా చెబుతారు. నిత్యం పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలి వస్తుంటారు. గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కావడంతో పర్యాటకపరంగా కూడా అంతర్వేదికి ప్రాధాన్యత ఉంది. యాత్రికుల కోసం నిత్యాన్నదాన పథకంతో పాటుగా గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఆలయం ఆధ్వర్యంలో కొన్ని వసతి గృహాలను సైతం నిర్మించారు. ఆలయానికి ఉన్న ఆదాయ వనరులకు తగ్గట్టుగా ఆలయాభివృద్ధి జరగలేదనేది స్థానికుల వాదన. అత్యంత విలువైన భూములున్నప్పటికీ వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నాలు జరగడం లేదని చెబుతున్నారు.స్వామి వారి కల్యాణం పేరుతో వసూళ్లు..!అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం పేరుతో ఏటా పంచాయతీల నుంచి వసూళ్లు చేస్తుంటారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి.గన్నవరం, అంబాజీపేట మండలాలలోని 107 పంచాయతీల్లో మేజర్‌ పంచాయతీలు 32, మైనర్‌ పంచాయతీలు 75 ఉన్నాయి. మేజర్‌ పంచాయతీలలో ఒక్కొక్క పంచాయతీ నుంచి రూ.3000, మైనర్‌ పంచాయతీల నుంచి రూ.2000 చొప్పున సామి వారి కల్యాణం పేరుతో వసూళ్లు చేస్తుంటారు. రాజోలు, మలికిపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి, పి.గన్నవరం మండల పరిషత్‌ల నుంచి ఒక్కొక్క మండల పరిషత్‌ నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. దేవాలయం పేరున కోట్ల ఆస్తులు ఉన్నా, దేవాలయంలో రూ.కోట్ల హుండీల ద్వారా, నిత్యాన్నదానం ద్వారా, యాత్రికుల కానుకల ద్వారా కోట్ల ఆదాయం వస్తున్నా ఏటా పంచాయతీల నుంచి, మండల పరిషత్‌ నుంచి వసూళ్లు చేయడం సరికాదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.దేవస్థానం భూములు అన్యాక్రాంతంఅంతర్వేది ఆలయానికి రికార్డుల ప్రకారం సుమారు 1000 ఎకరాల భూములు ఉన్నాయని అమలాపురం ఆర్‌డిఒ చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 32 గ్రామాల్లో ఇవి ఉన్నాయి. వాటిలో మెరక 416 ఎకరాలు కాగా, పల్లం 476 ఎకరాలుగా రికార్డులు చెబుతున్నాయి. తొలినాళ్లలో రికార్డుల ప్రకారం మెరక, పల్లం అంటూ ప్రస్తావించిన భూములు కూడా ప్రస్తుతం ఆక్వా సాగు కారణంగా కలిసిపోయినట్లు, అన్ని భూములనూ చదును చేసి చెరువులు తవ్వేసినట్టు కనిపిస్తోంది. అన్యాక్రాంతంపై తాము ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండడం లేదని ట్రస్ట్‌ బోర్డ్‌ సభ్యులు అంటున్నారు. గత ప్రభుత్వ హయంలో ట్రస్ట్‌ బోర్డ్‌ సభ్యులు ఆస్తుల అన్యాక్రాంతంపై పట్టుబట్టారు. చివరకు కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆలయ భూముల్లో శాశ్వత నిర్మాణాలకు అవకాశం లేకపోయినా పంచాయితీలు అనుమతినిచ్చాయి. వాటిపై లోకాయుక్త సీరియస్‌ అయ్యింది. అలాంటి నిర్మాణాలను తొలగించాలని పంచాయితీరాజ్‌ శాఖను ఆదేశించింది. అయినా పట్టించుకున్న వారు లేరు. ఆలయానికి లీజు ద్వారా ఏటా రూ.కోట్ల ఆదాయం రావాలి. కానీ నేటికీ నామమాత్రపు లీజులే ఉన్నాయి. ఎకరాకి రూ.300, రూ.200 చొప్పున వసూలు చేసే భూములు కూడా ఉన్నాయి. పైగా అవన్నీ ఇప్పుడు సామాన్యుల నుంచి పెద్దల చేతుల్లోకి మారిపోయాయి. అంతర్వేది దేవస్థానం భూములను వివిధ సొసైటీల పేరుతో సాగు నిమిత్తం కేటాయించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూములను స్వల్ప లీజు రుసుంతో సామాన్యులకు కేటాయించారు. స్థానికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, దేవాలయ నిర్వహణకు లోటు రాకుండా చూసేందుకు ఈ భూములను అప్పగించారు. అందులో కులాల వారీగా ఏర్పడిన వివిధ సొసైటీలు కూడా ఉన్నాయి. తొలుత మెరక భూముల్లో కొబ్బరి, పల్లం నేలలో వరి ఎక్కువగా సాగు చేసేవారు. గడిచిన మూడు దశాబ్ధాలుగా అంతర్వేది ప్రాంతంలో ఆక్వా సాగు జోరందుకుంది. ఇప్పుడు పూర్తిగా విస్తరించింది. దీంతో కొబ్బరి తోటలను తొలగించారు. వరి పొలాలను కూడా చెరువులుగా మార్చేశారు. ఆ క్రమంలో తాము సాగు చేయాలని ప్రయత్నించిన కొందరు లీజుదారులకు కూడా అవకాశం లేకుండా పోయింది.

➡️