అర్జీలను అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి

Dec 2,2024 23:09
అర్జీలను అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి

ప్రజాశక్తి-అమలాపురం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ మదన్‌మోహనరావు, డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ శివశంకర ప్రసాద్‌, డ్వామా పీడీ మధుసూదన్‌, ఐసిడిఎస్‌ పీడీ ఝాన్సీ రాణితో కలిసి ప్రజల నుంచి 130 అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిజిఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, అధికారులు గ్రీవెన్స్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా వ్యక్తిగతంగా అర్జీలను ఓపెన్‌ చేసి చూడాలన్నారు. ప్రతి శాఖకూ సంబంధించి జిల్లా డివిజన్‌ మండల స్థాయిలో గ్రీవెన్స్‌ నోడల్‌ అధికారులను నియమించే దిశగా మంగళవారం లోపు ఉత్తర్వులు జారీ చేసి జిల్లా యంత్రాంగానికి వివరాలు సమర్పించాలన్నారు. గ్రీవెన్స్‌ను పరిష్కరించే క్రమంలో సంబంధిత సమస్యను రూల్స్‌ ప్రకారం పరిష్కరించగలమా లేదా అన్న విషయాన్ని కచ్చితంగా రాతపూర్వకంగా తెలపాలన్నారు. అధికారులు అర్జీలను పరిష్కరించేటప్పుడు తప్పుగా టాగింగ్‌, డిస్పోజల్‌, ఎండార్స్‌మెంట్‌ చేస్తున్నారని.. తప్పిదాలను సరిదిద్దుకోకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ పిజిఆర్‌ఎస్‌ అర్జీలపై అధికారులు 20 నిమిషాలు సమయం వెచ్చించాలన్నారు. అత్యధికంగా పురపాలక, పంచాయత్‌, సర్వే, సెర్ప్‌, రెవెన్యూ, పోలీస్‌, పౌరసరఫరాలు, ఆరోగ్య శాఖలకు సంబంధించి అర్జీలు అందుతున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఆడిట్‌ టీములు అర్జీదారులకు ఫోన్‌ చేసి అర్జీల పరిష్కారంపై సంతృప్తి చెందారా లేదన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులకు కూడా ప్రజల గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేయడానికి లాగిన్స్‌ ఇచ్చినట్టు తెలిపారు. డిఇఒ ఎస్‌కె.సలీం బాషా, డిపిఒ శాంతలక్ష్మి, డిఎంహెచ్‌ఒ దుర్గారావుదొర, రామకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, బి.రాము, కార్తీక్‌, వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, పాల్గొన్నారు.

➡️