ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : పల్లెలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు, పల్లెలే దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు మూల స్తంభాలు, పల్లెలే దేశ సౌభాగ్యాలు అని చాటి చెబుతూ కాట్రేనికోనకు చెందిన క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ తమ 9వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామీణ భారతం పేరుతో 35 మంది చిత్రకారులతో రాడికల్స్ పేరు మీద జాతీయస్థాయి చిత్రకళ పోటీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ పోటీలలో అమలాపురం మండలం పాలగుమ్మి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో చిత్రలేఖన ఉపాధ్యాయుడు పోలిశెట్టి నరసింహ చంద్రకుమార్ తను వేసిన చిత్రానికి అవార్డు అందుకున్నట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దానితో పాటు పలువురి ప్రశంసలు అందుకున్నారు.ఆదివారం కాకినాడ న్యూ సెంచురీ స్కూల్లో జరిగిన చిత్రకళ ప్రదర్శన, బహుమతి ప్రధానోత్సవ సభలో క్రియేటివ్ హార్ట్స్ అధినేత ఆకొండి అంజి,పి. వి. వి. మహాలక్ష్మి, ఎమ్. రాధాకృష్ణ, ఎస్. ఎస్. ఆర్. జగన్నాథ రావు ( సెక్రటరీ క్రియ ), ఆకొండి సూర్య ( సినీ నటులు, డి 5 న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ ), నిహారిక సముద్రాల( ప్రిన్సిపల్ న్యూ సెంచురీ స్కూల్ కాకినాడ), వై.కళాసాగర్ (ఎడిటర్ www.64.kalalu విజయవాడ) చేతుల మీదుగా నరసింహ చంద్రకుమార్ అవార్డు అందుకున్నారు.
ఉన్నత పాఠశాల పాలగుమ్మి విద్యార్థికి అవార్డు
క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ రాష్ట్ర స్థాయిలో భారతదేశ ఔన్నత్యం కీర్తి అనే అంశం మీద నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్లో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పాలగుమ్మి లో 10వ తరగతి చదువుతున్న దంగేటి రీనా అలేఖ్య ఉన్నత ప్రతిభ కనబరిచి అవార్డును అందుకుంది.అవార్డులు అందుకున్న చిత్రలేఖన ఉపాధ్యాయుడు పోలిశెట్టి నరసింహ చంద్ర కుమార్,విద్యార్థి రీనా అలేఖ్య లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుంట్రు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.