అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

Apr 14,2025 18:39
IMG

వారోత్సవాలకు సంబంధించిన బ్రోచర్‌ విడుదల చేస్తున్న కలెక్టర్‌,ఉన్నతాధికారులు

ప్రజాశక్తి – అమలాపురం

అగ్ని ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. ఏప్రిల్‌ 14 నుంచి 20వ తేదీ వరకు ‘అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వండి’ అనే ఇతివత్తంతో అగ్నిమాపక సేవల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారోత్సవాలకు సంబంధించిన కరపత్రికను సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆపద సమయాలలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకమన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలందరూ అవగాహన పెంపొందించుకొని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ ప్రజలందరి బాధ్యతని కలెక్టర్‌ తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు పౌరుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో వారం రోజులపాటు జిల్లావ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలలో జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు డెమో ప్రదర్శనలు నిర్వహించడం.. విద్యాసంస్థలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్యాస్‌ లీకేజీలు అవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, విద్యుత్‌ వైరింగ్‌ ను భద్రంగా నిర్వహించడం, భవన నిర్మాణంలో ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు పాటించడం వంటివి చేపట్టడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్‌ తెలిపారు. ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక అధికారులకు 101 ద్వారా ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. అంతకుముందు దేశవ్యాప్తంగా వివిధ విపత్తులు, అగ్ని ప్రమాదాలను నివారించే సమయంలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక శాఖ అధికారులను స్మరించుకుంటూ అమలాపురం అగ్నిమాపక కేంద్రంలో స్టేషన్‌ అగ్నిమాపక అధికారి కెవి.మురళి కొండబాబు ఆధ్వర్యంలో .జిల్లా విపత్తుల స్పందన, అగ్నిమాపక అధికారి ఎన్‌ పార్థసారథి ముఖ్యఅతిథిగా స్మతి పెరేడ్‌ ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టి నిషాంతి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్‌ పార్థసారథి, అమలాపురం స్టేషన్‌ అగ్నిమాపక అధికారి కెవి మురళి కొండబాబు, కొత్తపేట స్టేషన్‌ అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్‌, అమలాపురం ముమ్మిడివరం అగ్నిమాపక కేంద్రముల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️