పల్లెల్లో భోగి పండుగ సందడి నెలకొంది. జిల్లావ్యాప్తంగా పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం విఎస్‌ఎం కళాశాల వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుతున్నట్టు తెలిపారు. ప్రజల్లో ఉన్న అశాంతి తొలగిపోయి, కొత్త వెలుగులు, ఆనందాలు, సిరి సంపదలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా పట్టణాల నుంచి పల్లెలకు జన సందోహం పోటెత్తింది.. హైదరాబాద్ విజయవాడ వంటి నగరాలకు ఉద్యోగాలకు పనులకు వెళ్లిన జనం తిరిగి పల్లెలకు చేరుకున్నారు. దీంతో మెయిన్ రోడ్లన్నీ జన సందోహంతో నిండిపోయాయి. ఉదయం నుండి రాత్రి వరకు రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు పట్టణాలు ఖాళీ అయిపోగా మరోవైపు పల్లెలన్నీ జన సందోహంతో కళకళలాడాయి. బంధుమిత్రులు, చుట్టాలు రాకతో పల్లెల్లోని ప్రతి ఇల్లూ పండుగ వాతావరణం సంతరించుకుంది. దుస్తుల షాపులు, కిరాణా షాపులు, పండ్ల దుకాణాలు, హోటల్స్ జన సందోహంతో నిండిపోయాయి.కపిలేశ్వరపురం మండలంలో ప్రతి పల్లెలో వీధి వీధికి భోగిమంటలతో పండగ సందడి నెలకొంది. చిన్నారులు తెల్లవారుజామున స్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి, భోగి దండలను భోగిమంటల్లో మంటల్లో వేశారు. ప్రతి ఇంటి ముందూ రంగురంగుల రంగవల్లులు దర్శనమిచ్చాయి. హరిదాసులు డూడూ బసవన్నలు సందడి చేశారు. అంగర, పడమరఖండ్రిగ, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, వల్లూరు, టేకి, నేలటూరు, వెదురుమూడి, కాలేరు, వడ్లమూరు, అచ్యుతాపురంలో భోగి పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఆలమూరు మండలంలోని పెదపళ్లలో భోగి పండుగ సందర్భంగా పోలేరమ్మ ఆలయం వద్ద సంబరాలు నిర్వహించారు. సంక్రాంతికి, తెలుగు సంస్కతికి ప్రతీక అయిన గంగిరెద్దు ఆటలు, డోలు సన్నాయి మేళాలు, హరిదాసు కీర్తనలతో భోగి వైభవాన్ని చాటేలా వేడుకలు జరిపారు. 300 అడుగుల పొడవైన భోగి దండ మంటల్లో వేశారు. ఉప్పలగుప్తం ఎస్.యానాం బీచ్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను ఎంఎల్‌ఎ అయితాబత్తుల ఆనందరావు అట్టహాసంగా ప్రారంభించారు. మొదటిరోజు పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు కుటుంబాలతో తరలివచ్చి సముద్ర తీరంలో స్నానాలు చేసి ఆహ్లాదంగా గడిపారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా తీరంలో ఏర్పాటు చేసిన బీచ్ బైక్, జీప్ రైడింగ్, గుర్రపు స్వారీలతో పర్యాటకులు సందడి చేశారు.బీచ్‌లో ఏర్పాటు చేసిన వేదికపై జబర్దస్త్ టీమ్ కార్యక్రమాలతో పాటు మిమిక్రీ, సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. సిఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్‌ఐ సిహెచ్.రాజేష్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఉత్సవ కమిటీ దంగేటి చిట్టిబాబు, పలచోళ్ల పద్మనాభం, లంకే భీమరాజు, పెట్టా అప్పారావు, అయితాబత్తుల రాజశేఖర్, పినిశెట్టి నరసింహారావు, ఉలిశెట్టి దొరబాబు, అయితాబత్తుల అజరు సింగ్, సత్తి చిన్న, రేవు తిరుపతిరావు, చీకట్ల శ్రీను, మన్నె వెంకటేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. అమలాపురం రూరల్ వన్నెచింతలపూడి అంబేద్కర్ నగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ,డివైఎఫ్‌ఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వసంత్ కుమార్ స్మారక సంక్రాంతి సంబరాలు ముగింపు సందర్భంగా సోమవారం బహుమతులు అందజేశారు.
