కండ్రికపేట పాఠశాలను విలీనం చేయొద్దని వినతి

Feb 5,2025 18:12
kandrika

ఎంఇఒ-2 సుబ్బరాజుకు వినతి పత్రం అందజేస్తున్న కండ్రిక పేట వాసులు

ప్రజాశక్తి – ఆలమూరు

మండల కేంద్రంలోని కండ్రికపేట ప్రాథమిక పాఠశాల విలీనం చేయవద్దని స్థానికులు ఎంఇఒ-2 పివి.సుబ్బరాజుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడు, ప్రధాన ఉపాధ్యాయుడు అద్దరి శ్రీనివాసరావును ప్రశ్నించగా పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వీరందరూ స్థానిక యానాదులపేట వారు కొందరు కాగా, రెండు కిలోమీటర్ల పరిధిలోగల ఇటుక బట్టీలు నుంచి మరికొందరు పాఠశాలకు వస్తున్నారని అన్నారు. వీరందరికీ కండ్రికపేట రామాలయం వద్ద ఉన్న పాఠశాల అందుబాటులో ఉంటూ ఎంతో అనువుగా ఉంటుందన్నారు. అటువంటి పాఠశాలలోని విద్యార్థులను విలీనం పేరుతో మౌలిక వసతులు అనగా టాయిలెట్స్‌ గానీ, రూమ్స్‌ గాని, మధ్యాహ్న భోజనం అందించడానికి సరిపడా ఖాళీ స్థలం గాని, ఆట స్థలం గాని లేని పాఠశాలకు పంపిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. అందుకే స్థానికులు పాఠశాలను విలీనం చేయడం తగదని, పాఠశాల కమిటీ సభ్యులు, అక్కడ నివాస ప్రాంత పెద్దలు మండల విద్యాశాఖ అధికారి వారని కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. వెంటనే విలీనాన్ని నిలుపుదల చేయాలని స్థానికులు కోరారని ఎంఇఒ-2 సుబ్బరాజు అన్నారు.

➡️