కోడిదే పైచేయి

Jan 13,2025 22:55
కోడిదే పైచేయి

ప్రజాశక్తి- అమలాపురం పోలీసులపై ఎప్పటిలానే ఈ సారి కూడా కోడే పైచేయి సాధించింది. నెల రోజులుగా పోలీసులు చేస్తున్న హెచ్చరికలు, పెట్టిన ఆంక్షలు ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 450కి పైగా బరులు వెలశాయి. వందల కొద్దీ కోడి మెడలు తెగిపడ్డాయి. తొలి రోజు రూ.100 కోట్ల వరకూ చేతులు మారినట్టు అంచానా.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపుగా అన్ని మండలాల్లో తొలిరోజే ప్రతి మండలంలోనూ 5 నుంచి 10 వరకూ బరులు వెలశాయి. ఒకొక్క పందెం రూ.50 వేల నుంచి మొదలై రూ.లక్షల వరకూ సాగింది. ఈ ఏడాది బరుల నిర్వహణలో అధికార పార్టీదే పైచేయిగా నిలిచింది. గతంలో ఆసక్తి ఉన్న వారంతా పార్టీలకతీతంగా బరులు ఏర్పాటు చేసుకునేవారు. ఇప్పుడు అధికార పార్టీ నేతల ఆశీస్సులుంటేనే పందేలకు అవకాశం లభించింది. డిప్యూటీ సిఎం ఇలాకా అయిన పిఠాపురం, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఇలాకాల్లో సైతం తొలిరోజే వందల సంఖ్యలో కోడి పందేలు జరిగాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈసారి కోడి పందాల నిర్వహణకు ఆంక్షలు కఠినంగా వుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తతంగా ప్రచారం చేశారు. కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్‌, సామర్లకోట, కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, దేవరపల్లి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో అంబాజీపేట, సఖినేటిపల్లి, మండపేట, రాయవరం తదితర మండలాల్లో చిన్న బరులపై తమ ప్రతాపాన్ని చూపగలిగారు. కోడి కత్తులు కట్టే పలువురిని బైండోవర్‌ చేశారు. మరికొందరిని అరెస్టు చేసి వందలాది కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పందేలకు స్థలాలను ఇచ్చే యజమానులను ముందస్తుగానే హెచ్చరించారు. ఇలా అన్ని రకాలుగా పోలీసులు హెచ్చరికలు చేసినా భోగి నాడు అవన్నీ మంటల్లో కలిసిపోయాయి. శనివారం నుంచే పలు చోట్ల బరులు సిద్ధం కాగా భోగి పండగ అయిన సోమవారం నుంచి జోరుగా పందేలు మొదలయ్యాయి.పోలీసులపై కూటమి నేతలు ఒత్తిళ్లు?కూటమి ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నేతల నుంచి వచ్చిన అనధికార అదేశాలతో పోలీసులు తలొంచక తప్పలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలంలోని సమనస, వన్నెచింతలపూడి, సవరప్పాలెం, తాండవపల్లి, బండారులంక, ఇందుపల్లి, చిందాడగరువు, గున్నేపల్లి అగ్రహారం, మామిడికుదురు, అల్లవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కొత్తపేట, మల్కిపురం, అంబాజీపేట, రాజోలు ఇలా పలు చోట్ల పందేలు జోరందుకున్నాయి. కాకినాడ జిల్లా కాకినాడ సిటీ,రూరల్‌ పరిధిల్లో బరుల్లో పందాలు సాగుతున్నాయి. మెట్ట ప్రాంతాలయిన కరప, పిఠాపురం, గొల్లప్రోలు, ఏలేశ్వరం,తుని, రాజనగరం, గండేపల్లి, కత్తిపూడి, శంఖవరం, జగ్గంపేట ఇలా చిన్న పెద్ద అన్నీ కలిపి దాదాపు 450 బరుల్లో పందాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కోనసీమలో 20 ప్రాంతాల్లో కీలక బరుల్లో పందేలు, గుండాట, మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. పార్టీల నేతలే నిర్వహకులుస్వయానా పందేలను ప్రజాప్రతినిధులే ప్రారంభించడం విశేషం. కాకినాడ ఎంపీ ఉదరు శ్రీనివాస్‌ పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో కోడిపందేలను ప్రారంభించారు. అలాగే కాకినాడ రూరల్‌ జనసేన ఎంఎల్‌ఎ పంతం నానాజీ కూడా తన నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒక బరిలో పందేలను ప్రారంభించడం చర్చనీయాశంగా మారింది. మరోవైపు అన్ని చోట్లా అధికార టిడిపి, జనసేన నేతలే నిర్వాహకులుగా వ్యవహారిస్తున్నారు. పందేలు, గుండాట నిర్వహణకు రూ. లక్షల్లో సొమ్ములు వసూలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన, టిడిపి బాహాబాహికూటమి పార్టీల నేతలు అధికారంలో ఉండడంతో పలుచోట్ల పోటాపోటీగా బరులు వెలిశాయి. టిడిపి, జనసేన కార్యకర్తలు వేరువేరుగా బరులను సిద్ధం చేసి పందేలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఫక్రుద్దీన్‌ పాలెంలో తొలిరోజు టిడిపి, జనసేన కార్యకర్తలు మధ్య కోట్లాట జరిగింది. పిఠాపురం పట్టణంలో విడిగా ఏర్పాటు చేసిన టిడిపి బరిలో ఓడిపోయిన కోడి పుంజును కింద పడకుండానే తీసేసారని పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు యువకులు బాహాబాహీకి దిగారు. నిర్వాహకులు, నాయకులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

➡️