పల్లం గ్రామంలో కొట్లాట

May 13,2024 23:14
పల్లం గ్రామంలో కొట్లాట

ప్రజాశక్తి-కాట్రేనికోన, అమలాపురం రూరల్‌ఎన్నికల నేపథ్యంలో తీరప్రాంత మత్సకార గ్రామమైన పల్లంలో ఘర్షణలు చెలరేగాయి. వైసిపి, తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ, వైసిపి వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలు ఇటుక రాళ్లతో దాడులకు తెగబడడంతో వైసిపికి చెందిన మల్లడి చిన ధర్మారావు, మల్లాడి నరసింహ, మల్లాడి సతీష్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. పలువురి ఇళ్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా అమలాపురం డిఎస్‌పి ఆధ్వర్యాన పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మరో మత్సకార గ్రామమైన బలుసుతిప్పలో వైసిపి, టిడిపి మధ్య కవ్వింపు చర్యలు జరగడంతో స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుపార్టీల నాయకులు గ్రామంలోకి వచ్చి వెళ్లిన తరువాత కార్యకర్తలు ఘర్షణకు దిగారు. మరో గ్రామం కుండలేశ్వరంలో వైసిపి, తెలుగుదేశం కార్యకర్తల మద్య వాగ్వివాదం జరిగి తోపులాట జరిగింది. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్వల్ప గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అనంతరం కాట్రేనికోన పోలీసులకు ఫిర్యాదు చేశారు.అమలాపురం మండలం మండలం నడిపూడి గ్రామంలోని 13,14 పోలింగ్‌ బూత్‌ల వద్ద ఇరు వర్గాల మధ్య తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ బూత్‌ల వద్ద వృద్ధులకు టిడిపి కార్యకర్తలు గుర్తులు చెబుతున్నారంటూ వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య తోపులాటతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పారు.

➡️