ప్రజాశక్తి-రాజోలు: సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఆదివారం మలికిపురలోని ఎంఎల్ఎ క్యాంప్ కార్యలయంలఫ నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఎంఎల్ఎ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 12 కుటుంబాలకు రూ.13,50,399 మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. గడిచిన 7 నెలలు కాలంలో 100 బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేయడం చాల ఆనందంగా ఉందని బాధిత కుటుంబాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియచేసారు. చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
