పలువురి నాయకుల సంతాపం ప్రజాశక్తి-అమలాపురం, అయినవిల్లిసిపిఎం నాయకురాలు కుడి పూడి రాఘవమ్మ (72) ఇకలేరు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించ డంతో మంగళవారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడిలో కన్ను మూశారు. ఆమె భర్త గతంలోనే మృతి చెందారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె అంత్యక్రియలు స్వగ్రామమైన తొత్తరమూడిలో బుధవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవమ్మ మృతికి సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు సంతాపం తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాఘ వమ్మ మరణం ఉద్యమాలకు తీరని లోటన్నారు. వ్యవసాయ కూలీ పోరాటాలు, మద్యపాన వ్యతిరేక పోరాటాల్లో రాఘవమ్మ క్రియా శీలకంగా పనిచేశారని కొనియాడారు. పార్టీ, ప్రజా సంఘాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘం అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలిగా, రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారని తెలిపారు. అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన రాఘవమ్మకు భర్త ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. భర్త కుడుపూడి నరసింహమూర్తి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆయన గతంలోనే మరణించారు. ఆయన సిపిఎంలో క్రియాశీలకంగా పని చేశారు. ఆయన ప్రోత్సాహంతో రాఘవమ్మ ప్రజా ఉద్యమాల్లో కి వచ్చారు. భర్త మరణం అనంతరం కూడా ఆమె పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1990లో కోనసీమలో ఉవ్వెత్తున జరిగిన కూలీ పోరాటాలు, భూస్వామ్య వ్యతిక పోరాటాల్లో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటనలో ఆమె ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. రాఘవమ్మ మృతికి వ్యవసాయ కార్మిక సంఘం అఖిల బారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.బలరాం, అండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చల్లా రవికుమార్, డివి.రాఘవులు, ఎన్.బలరాం, జి.దుర్గాప్రసాద్, కె.కృష్ణవేణి, టి.నాగవరలక్ష్మి, డి.లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటి కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు తాడి శ్రీరామ్మూర్తి, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జ్యోతిబసు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.సురేంద్ర, ఎంటివి.సుబ్బారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ కె.శంకర్ కో కన్వీనర్ కె.ప్రణీత్, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసిరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.ఎస్తేరురాణి, కార్యదర్శి మలకా సుభాషిణి, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు బి.వెంకటలక్ష్మి, కోశాధికారి పి.అమూల్య తదితరులు సంతాపం తెలిపారు.