మురికి కూపాలుగా పంట కాలువలు

Jun 11,2024 22:49
మురికి కూపాలుగా పంట కాలువలు

ప్రజాశక్తి – రాజోలు పంట కాలువలు మురికి కూపాలుగా మారాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కడలి గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రధాన పంటకాలను పరిశీలించారు. పంట కాలువలో సెప్టిక్‌ ట్యాంక్‌ నుండి నేరుగా చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు చుట్టుప్రక్కల ఉన్న షాపుల నుంచి వాడే వ్యర్థ జలాలు ప్లాస్టిక్‌ బాటిల్స్‌ పంట కాలవల్లో పడేస్తున్నారని తెలిపారు. ప్రధాన పంట కాలువ మురుగు కాలువలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఈ వ్యర్థాలను పంట కాలువల్లోకి వదులుతున్న వారిపై తక్షణం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంతటి వ్యర్థాలను తొలగిస్తూ కష్టపడి పని చేస్తున్న ఉపాధి కూలీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఒక పక్క ఉపాధి హామీ పథకంలో పని దొరుకుతుందని సంతోషించాలో లేక ఈ వ్యర్థాలతో అనారోగ్యాలు బారిన పడుతున్నందుకు బాధ పడాలో అర్థం కావడం లేదని కూలీలు వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రధాన పంటకాలువలన్నిటిలో ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. వారం రోజుల క్రితం కలెక్టర్‌కు పంటకాలువలు మరమ్మతులు చేయాలని వినతిపత్రం అందించినట్టు తెలిపారు. ఈ వ్యర్థ జలాలను సెప్టిక్‌ ట్యాంకుల నుంచి వచ్చే వ్యర్థాలనూ పంటకాలువల్లోకి వదులుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.

➡️