ఓడలరేవును అభివృద్ధి చేయాలని ధర్నా

Mar 10,2025 23:17
ఓడలరేవును అభివృద్ధి చేయాలని ధర్నా

ప్రజాశక్తి-అమలాపురం ఓడలరేవులో ఒఎన్‌జిసి సంస్థ సుమారు 30 ఏళ్ల నుంచి చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని వెలికితీస్తోందని, రూ.వేల కోట్ల ఆదాయం అర్జిస్తోందని, కానీ గ్రావాభివృద్ధికి సహకరించడం లేదని గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఆన్‌షోర్‌, ఆఫ్‌షోర్‌ టెర్మినల్స్‌ నుండి గ్యాస్‌ చమురు వెలికితీయడం వల్ల భూమి కుంగిపోవడం, భూగర్భ జలాలు పాడైపోవడం, సముద్రం కోతకు గురికావడం, వాయు కాలుష్యం, జల కాలుష్యం మొదలగు సమస్యలతో గ్రామ ప్రజలు భయాందోళనలతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గ్రామం నుంచి రూ.వేల కోట్లు ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ ఒఎన్‌జిజి సంస్థ గ్రామాభివృద్ధి విషయంలో ఆమడ దూరంలో ఉందన్నారు. గ్రామం నష్టపోతున్నా ఒఎన్జిసి సంస్థ మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయారు. ఒకవైపు సముద్రం కోతకు గురై వందల ఎకరాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, భవిష్యత్తులో సముద్రం గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదవం ఉంది. ఇటీవలి వాతావరణం మార్పులకు సముద్రం ఒఎన్జిసి టెర్మినల్‌ గోడను తాకి టెర్మినల్లోనికి చొచ్చుకొని వచ్చిందని, సముద్రంలో పైపులైను నిర్మాణంతో తీర ప్రాంతం మరింత కోతకు గురవుతోంది. ఒఎన్‌జిసి సంస్థ ప్రమోటెక్‌ అనే కంపెనీకి కాంట్రాక్ట్‌ బేసిస్‌లో ఉద్యోగులను జాయిన్‌ చేసుకునే విషయంలో స్థానికులకు అన్యాయం చేస్తోందని అన్నారు. 70 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే విషయంలో నిరాశే మిగులుతోందన్నారు. వెంటనే స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇచ్చి ఆదుకోవాలని, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం కల్పించాలని, ఒఎన్‌జిసి సంస్థ కార్యకలాపాల వల్ల గ్రామం కాలుష్యంలో కోరల్లో చిక్కుకుందని తెలిపారు. ఈ ధర్నాల్లో దెందుకూరి సత్తిబాబు రాజు, కొల్లు విష్ణుమూర్తి, నాతి లెనిన్‌ బాబు, పెచ్చెట్టి రామకృష్ణ, గుండుమేను శ్రీనివాసరావు, కొప్పాడి రామకృష్ణ పాల్గొన్నారు.

➡️