తుపాను వల్ల కురిసన వర్షాలకు పాడైన పంటలను రైతులు ఒబ్బిడి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి సూచనలు పలు సూచనలు చేశారు. ప్రజాశక్తి-యంత్రాంగంఅమలాపురం తుపాను కారణంగా వర్షాలతో వరి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంట కళ్లాలలో, రోడ్ల పక్కన ఉన్న ధాన్యం రాశులను రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అన్నదాతను తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. మూసూళ్లు చేసిన ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. వర్షానికి తడిసిన ధాన్యం రంగు మారినా మొలకెత్తినా దళారులు, మిల్లర్లు కుమ్మక్కై తేమ పేరిట ధాన్యం విక్రయాల్లో రైతుకు విపరీతమైన నష్టం కలుగుతుంది. జిల్లాలో అంబాజీపేట, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, అయినవిల్లి తదితర మండలాల్లో వరిపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సుమారు 1.60 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇప్పటి వరకూ సుమారు 90 వేల ఎకరాల్లో వరి పంట మాసూళ్లు పూర్తి చేశారు. దాదాపు 58 వేల ఎకరాల్లోని పంట కళ్లాలు, రోడ్లపై ఉంది. మిగిలిన ఎకరాల్లో పంట కోత దశకు చేరుకుంది. ఈ ఖరీఫ్ లో 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని 307 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు నష్టం వాటిల్లకుండా 24 శాతం వరకూ తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు.ఉప్పలగుప్తం తుపాను కారణంగా దెబ్బతిన్న వరిచేలను సోమవారం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నందకిషోర్ పరిశీలించారు. చిన్నగాడవిల్లిలో వరి చేలని పరిశీలించిన ఆయన వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు సూచించారు. మండలంలోని 10 గ్రామాల్లో 383 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని అంచనా వేశారు. మండలంలో 44 81 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా ఇప్పటివరకు 1961 ఎకరాల్లో మాత్రమే వరి కోతలు పూర్తయినాయని ఇంకా 2,394 ఎకరాల్లో వరి కోతలు పూర్తవలసి ఉందని మండల వ్యవసాయ అధికారి జి.కుమార్ బాబు తెలిపారు. ముమ్మిడివరం రైతులు తుపాను కారణంగా కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి పంటలను కాపాడుకోవాలని ప్రధాన వ్యవసాయం శాస్త్రవేత్త నందకిషోర్ సూచించారు. పలు ప్రాంతాల్లో వర్షాలకు తడిసి నీట మునిగిన పంట పొలాలను, ధాన్యం రాశులను సోమవారం శాస్త్రవేత్తల బందం పరిశీలించింది. ఈ సందర్బంగా శాస్త్రవేత్త నంద కిషోర్ రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. కోత కోసి పనలపై ఉన్న వాటిని కుప్పలుగా వేసే టప్పుడు ఎకరాకు 20 కిలోల ఉప్పు పనలపై పిచికారీ చేయాలని, కోత కోసి ఉన్న పనలు గింజలు మొలకెత్త కుండా 5 శాతం ఉప్పు ద్రావకం పనలపై పిచికారీ చేయాలని, పొలంలో నీరు నిలిచినటైతే గట్ల పైకి తెచ్చి విడిగా పేర్చి ద్రావకం చల్లాలని, ఎండకు తిరగేసి ఎండబెట్టు కోవాలని సూచించారు.
