గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

Feb 13,2024 10:21
గురుకులంలో 52 మందికి అస్వస్థత

ప్రజాశక్తి-రామచంద్రపురం : ద్రాక్షారామ సమీపంలోని ఆదివారపుపేటలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్‌ పాయిజన్‌ జరిగి 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో డిహైడ్రేషన్‌కు గురైన ఎనిమిది మంది విద్యార్థులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి తరలించారు. ఆదివారం చికెన్‌ ఇతర పదార్థాలు తీసుకున్న విద్యార్థులకు రాత్రి నుంచి విరేచనాలు, వాంతులు అవడంతో అప్రమత్తమైన ప్రిన్సిపల్‌ ఎన్‌వి.నాగేశ్వరరావు వైద్య సహాయం అందజేశారు. ఎనిమిది మందిని 108లో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు బర్ల ధనుష్‌, కుంచే రామచరణ్‌, కె.ప్రసాద్‌, కె.జారు, రెడ్డి సురేంద్ర, గుర్రాల కార్తీక్‌, చిట్టూరి సత్య ప్రసాద్‌, సింగలూరు దినేష్‌ చికిత్స పొందుతున్న వారిలో ఉన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాలలో 52 మంది విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్క్‌ఉ గురైన విషయం స్థానిక ప్రిన్సిపల్‌ జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన డిఎంహెచ్‌ఒను పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. నలుగురు వైద్యులతో పాఠశాలలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పలువురు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి వెళ్లి తమ పిల్లల ఆరోగ్యంపై ఆరా తీశారు.ఆందోళన చెందాల్సిన అవసరం లేదుగురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ వల్లలో 52 మంది విద్యార్థులకు అనారోగ్యానికి గురైన సంఘటనలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ మణికంఠ, డాక్టర్‌ సందీప్‌, డాక్టర్‌ అలేఖ్య, డాక్టర్‌ ప్రశాంతి వివరించారు. ఆదివారం ఫుడ్‌ పాయిజన్‌కు గురైన విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నామని, వీరిలో డిహైడ్రేషన్‌కు గురైన ఎనిమిది మందిని ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. వారు వివరించారు. వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. మినరల్‌ వాటర్‌ అందజేస్తున్నాంవిద్యార్థులకు ప్రస్తుతం బయట నుండి మినరల్‌ వాటర్‌ తీసుకువచ్చి అందజేస్తున్నామని, కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాటర్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ పరిశుభ్రతపై దృష్టి సారించామని కళాశాల ప్రిన్సిపల్‌ ఎన్‌వి.నాగేశ్వరరావు తెలిపారు. ఫుడ్‌ పాయిజన్‌కుకు కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.నాణ్యతలేని సరుకులు, అపరిశుభ్రతఅంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సహఫలవుతున్న వస్తువుల్లో నాణ్యతా లోపం ఉండవచ్చునని స్థానిక వైద్యులు తెలియజేస్తున్నారు. విద్యార్థుల భోజన శాలకు ఎదురుగా తీవ్ర అపరిశుభ్రత నెలకొని ఉంది. వీటితో పాటుగా హాస్టల్‌ ప్రక్కన నిత్యం పరోటాలు, పాన్‌ మసాలా వంటి చాక్లెట్లు విద్యార్థులకు లభించడం కూడా విద్యార్థులు అనారోగ్యానికి గురవడానికి కారణంగా తెలుస్తోంది. వీటన్నిటిపైన చర్యలు తీసుకుని విద్యార్థుల ఆరోగ్యానికి హాని లేకుండా చూడాలని విద్యార్థులు తల్లిదండ్రులు అధికారులు కోరుతున్నారు.

➡️