నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Sep 30,2024 23:20
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

ప్రజాశక్తి-రామచంద్రపురం ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు నిరుద్యోగ యువతకు 45 రోజులపాటు టెట్‌, డిఎస్‌సిపై ఉచితంగా కోచింగ్‌ ఇచ్చినట్టు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. బుధవారం రామచంద్రపురం విఎస్‌ఎం కళాశాలలో 45 రోజులపాటు మంత్రి, ఇతర దాతలతో కలిసి ఉచితంగా ఏర్పాటు చేసిన కోచింగ్‌ పూర్తయిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రంలో 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి మెగా డిఎస్‌పిపై తొలి సంతకం చేశారన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుని నిరుపేద విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించడానికి వారికి అవసరమైన టెట్‌, డిఎస్‌సిలకు పట్టణంలోని విఎస్‌ఎమ్‌ కళాశాలలో 45 రోజులుగా ఉచితంగా కోచింగ్‌ ఇచ్చినట్టు తెలిపారు. ఉచిత శిక్షణా శిబిరంలో నిపుణులైన అధ్యాపకులచే సబ్జెక్టు వారీగా సుమారు 300 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చామని, శిక్షణ పొందిన నిరుద్యోగ యువత అంతా ఉపాధ్యాయులుగా ఎంపికవ్వాలని ఆయన ఆకాంక్షించారు. శిక్షణ పొందిన 300 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేశారు. అనంతరం మంత్రి ప్రతి అభ్యర్థికీ హాల్‌ టికెట్స్‌ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సత్యం, కెవిఆర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌, విఎస్‌ఎం కళాశాల ప్రిన్సిపల్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️