ప్రజాశక్తి – ఆలమూరు : స్వాతంత్ర సమరయోధుడు ఆలమూరు రూరల్ బ్యాంక్ వ్యవస్థాపకుడు మాజీ ఎమ్మెల్సీ స్వర్గీయ నరసింహదేవర సత్యనారాయణమూర్తి 69వ వర్ధంతి స్థానిక బొబ్బా చిన వీరన్న సహకార సొసైటీ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే కోపరేటివ్ రూరల్ బ్యాంక్ వ్యవస్థను పరిచయం చేసి రైతులకు రుణాలు, ఎరువులు తక్కువ ధరలకు అందించే విధంగా ఆలమూరులో కోపరేటివ్ రూరల్ బ్యాంకును ఏర్పాటు చేసిన ఘనత సత్యనారాయణమూర్తికి దక్కుతుందని పలువురు వక్తలు అన్నారు. స్థానిక బొబ్బా చినవీరన్న సహకార సంఘం వద్ద ఉన్న నరసింహదేవర విగ్రహానికి సోమవారం సహకార సంఘం పర్సన్ఇంచార్జి డి.రాంబాబు, సీఈవో బొబ్బా రామసుబ్రహ్మణ్యచౌదరి, గుమస్తాలు అంగర సింగుబాబు, చోడే రాజా లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహదేవర అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రిక్షా కార్మికులకు, రైతులకు సహకార సొసైటీ వారు పండ్లు పంపిణీ చేసినారు.