అధిక సంఖ్యలో తరలివచ్చిన హార్వెస్టర్లు 

Mar 31,2024 12:18 #Konaseema

దాల్వా కోతలకు మంచి డిమాండ్

ప్రజాశక్తి-రామచంద్రపురం : దాల్వా పంటలు పూర్తిగా పండి కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో పెద్ద ఎత్తున హార్వెస్టర్లు రామచంద్రపురం కే గంగవరం మండలానికి తరలివచ్చాయి. వేసవి తాపానికి కూలీలు ఎవరు పొలం పనులకు రాకపోవడంతో రైతులంతా హార్వెస్టర్ల పైనే ఆధారపడు తున్నారు. దీంతో పెట్టుబడిదారులంతా వ్యవసాయ రంగంలో హాధునిక యంత్రాలు ఉపయోగించి వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ పశ్చిమగోదావరి జిల్లాలోనూ వరి అధిక శాతం పండించడంతో హార్వెస్టర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతోపాటుగా సాంప్రదాయ వ్యవసాయ కూలీలను ఉపయోగించడంతో కూలీలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఎకరాకు పదివేలు ఖర్చు అవుతుండగా హార్వెస్టర్లకు ₹4,000 తోనే వరి కోత పూర్తి చేయడం ధాన్యం నేరుగా రైతుగా అందించడం జరుగుతుంది. దీంతో సాంప్రదాయ కూలీలతో కోతలు కోసి కుప్ప వేసి, ఆపై నూర్పిడి చేయడానికి ఎకరాకు 15 నుండి 20,000 ఖర్చు అవుతుండగా ఆధునిక యంత్రాలైన హార్వెస్టర్లు డబ్బా మిషన్లతో వరి కోతలు నూర్పిడి పూర్తి చేయడం వల్ల రైతుకు రూ.5000 మించి ఖర్చు అవడం లేదు. దీంతో రైతులంతా వరి కోతలకు హార్వెస్టర్లు వైపే మొగ్గు చూపుతున్నారు. హార్వెస్టర్ల యజమానులు ఈ విషయాన్ని గమనించి పెద్ద ఎత్తున తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాల నుండి అదేవిధంగా రాయలసీమ జిల్లాల నుండి పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఆర్వెస్టర్లను ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో దిగుమతి చేశారు. ఈ నెల 15 నుండి కోతలు ముమ్మరంగా ప్రారంభమవుతున్న వేళ హార్వెస్టర్లకు మంచి డిమాండ్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుండి ఈ ప్రాంతాలకు వాటిని దిగుమతి చేసి తద్వారా పెట్టుబడుదారులు అధిక లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తుండగా. ఎండాకాలంలో కూలీలు వ్యవసాయ పనులకు అంతగా సంసిద్ధులు కానందున రైతులు సైతం ఆధునిక యాంత్రాలతోనే దాల్వా పనులకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా హార్వెస్టర్లు ఉపయోగించడం వల్ల రోజుకు పది నుండి 20 ఎకరాల వరకు వరి కోతలు కోసే వీలుంటుంది. దీంతో ఒకవైపు డబ్బు మరొకవైపు సమయం ఆదా ఆవుతుందని రైతన్నలు భావిస్తున్నారు.

➡️