ట్రాక్టర్‌పై ఎండుగడ్డిని తీసుకువెళుతున్న రైతులు
ప్రజాశక్తి – రాజోలు
పశువుల పెంపకం రైతులకు భారంగా మారుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడంతో కూలీల కొరత వేధిస్తోంది. ఎండుగడ్డి తగినంత లేకపోవడం, పచ్చిక బయళ్లు, ఖాళీ బంజరు భూములు తగ్గిపోవడం వంటి కారణాలతో పశువులకు మేత కరువవుతోంది. దీంతో పశు పోషణ రైతులకు భారంగా మారింది. పూర్వం ప్రతి రైతు కమతం గొడ్లశాల, గడ్డివాము, పాడి పశువులతో కళకళలాడేది. నేడు ఏ రైతు మకాం చూసినా కళ్లాలు కళగా కనిపించట్లేదు. పల్లె ప్రజలు సైతం ప్యాకెట్ పాలపైనే ఆధారపడుతున్నారు. గతంలో ఓ సాధారణ రైతుకు వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం ద్వారా అదనపు ఆదాయం చేకూరేది. గేదె పాలు ఇంటి అవసరాలకు పోను మిగిలిన పాలు విక్రయిం చుకోవడం ద్వారా కుటుంబపోషణ జరిగిపోయేది. పల్లె సీమలంటేనే పాడి పంటలకు నెలవు. అటు వంటి పల్లెల్లో వ్యవసాయం కళ తప్పుతోంది. మూత పడుతున్న పాడిపరిశ్రమలుజిల్లాలో తెల్లజాతి పశువుల కన్నా నల్లజాతి గోవులే అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.29లక్షల పాడి పశువులు ఉండగా వాటిలో 1,53,542 గేదెలు, 75,460 ఆవులు ఉన్నాయి. పంజాబ్ నుంచి ముర్రా జాతి గేదెలను ఎక్కువగా దిగుమతి చేయడం జరిగింది. ఒక గేదె (లేదా) ఆవుకు ఏడాది పొడవునా రెండున్నర ఎకరాల వరి చేలో గడ్డి అవసరం అవుతుంది. గేదె/ఆవు సరాసరిన నెలకు 150 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. కూలి రేట్లు పెరగడంతో వరి మసూళ్లను యంత్రాలతో చేపట్టారు. ఈ కారణంగా ఎండు గడ్డి దొరకట్లేదు. ఎకరం ఎండుగడ్డి మిషన్‌తో కోసినది అయితే రూ.4 వేలు ఉంది. అదే కూలీలతో కోసినదైతే రూ.10 వేలుపైనే పలుకుతోంది. ఒక గేదె/ఆవుకు ఎండుగడ్డి కోసం రూ.25 వేలు ఖర్చు అవుతుంది. పశువుల కాపరికి రోజు కూలీగా రూ.600 నుంచి రూ.700 వరకు చెల్లించాల్సి వస్తోంది. పచ్చిక భూములు, పుంత భూములు లేకపోవడంతో పశువులకు గ్రాసం కొరత ఏర్పడడంతో దాణాలపైనే ఆధారపడుతున్నారు. గేదె ధర రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండగా ఆవు ధర రూ.40 వేల నుంచి రూ.60 వేలు వరకు పలుకుతోంది. ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినా పాలు దిగుబడులు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. పాలుకు గిట్టబాటు ధర లభించకపోవడంతో పాడి పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి.ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వాలుపాడి పరిశ్రమకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు కేవలం ప్రకటనలకే పరిమితయ్యాయనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో సైలేజ్ గడ్డిని రైతులకు సబ్సిడీపై అందించేవారు. ప్రస్తుతం ఇవ్వట్లేదు. పశుక్రాంతి పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు పాడి పశువులకు రాయితీ అందించే పథకానికి మంగళం పాడేశారు. పాడి పరిశ్రమ ప్రోత్సాహానికి సంక్రాంతి పర్వదినాల్లో పాల పోటీలు, పశువుల అందాల పోటీలు నిర్వహించేవారు. నాలుగేళ్లుగా వాటి ఊసేలేదు.పశువులు మరణిస్తే భీమా వర్తించట్లేదు. పశు సమగ్ర క్షేత్రాలు, పశుగ్రాసం కోసం ఇచ్చే ప్రోత్సాహం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పాడి పశువుల పెంపకం రైతులకు గుదిబండలా మారింది. తద్వారా పశువుల సంఖ్య గణనీయంగా తగ్గి భవిష్యత్తులో పాడి పరిశ్రమ కనుమరుగై కత్రిమ పాలు, ప్యాకెట్ పాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇపుడు సైలేజ్ గడ్డి స్థానంలో టోటల్ మిక్స్‌డ్ దాణా, సమీకత దాణా అందిస్తోంది.ఏడాదికి 18 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం !ప్రతి పంటలోను ఎండుగడ్డి మాసూళ్లు రైతు లకు సవాల్‌గా మారుతోంది. ఒకవైపు పంట మాసూళ్లతో పాటు మరోవైపు పశువుల కోసం ఎండుగడ్డి మాసూళ్లు కత్తిమీద సాములా మారింది. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు చాలాశాతం ఎండుగడ్డి పొలాల్లో తడిచిపో యింది. 2.29లక్షల పాడి పశువులు ఉండగా వాటిలో 1,53,542 గేదెలు, 75,460 ఆవులు ఉండగా ఏడాదికి ఎండి పశుగ్రాసంగా సుమారు 18 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది రెండు లక్షల 52 వేల ఎకరా ల్లో సార్వా సాగు సాగాల్సి ఉండగా 1.69 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిసాగు సాగింది. ఇప్పటి వరకు మాసూళ్లు అయిన ఎండుగడ్డి నాలుగు నెలలకు మించి సరిపోదని రైతులు అంటున్నారు. గత పంటలో ట్రాక్టర్ ఎండుగడ్డి రూ.6వేలు ఉంటే ఈసారి రూ.8 వేల నుంచి రూ.10 వేలు వరకు అమ్ముతున్నారు. మిషన్ ద్వారా చుట్టిన మోపు రూ.35కు అమ్ముతున్నారు. తుపానులు, అకాల వర్షాలతో ఏడాదిలో సార్వా, దాళ్వా, పంటల్లో సగం గడ్డి మాత్రమే మాసూళ్లు చేయగలుగుతున్నారు.