జిల్లాలో 12 ఇసుక రీచ్‌ల గుర్తింపు

Oct 9,2024 22:02
జిల్లాలో 12 ఇసుక రీచ్‌ల గుర్తింపు

ప్రజాశక్తి-అమలాపురం జిల్లాలోని 12 ఇసుక రీచ్‌లలో నీటి ప్రవాహం తగ్గగానే ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో అజెండా అంశాలను అంశాల వారీగా కమిటీ సభ్యులతో కలెక్టర్‌ చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని శాఖల అనుమతులతో 12 ఇసుక రీచ్‌ లను గుర్తించినట్టు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గగానే ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత 12 ఇసుక రీచ్‌లలో ఇసుకను తవ్వే ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ఎంపికకు సంబంధించి విధి విధానాలను జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలోని టెండర్‌ నోటిఫికేషన్‌ కమిటీ గురువారం లోపు తయారు చేయాలన్నారు. త్వరలోనే టెండర్‌ నోటిఫికేషను ఇచ్చి గుత్తేదారులను ఎంపిక చేసి రీచ్‌లలో ఇసుకను తవ్వే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. పట్టా భూముల్లో ఇసుకను తవ్వుకోవడానికి రైతులు దరఖాస్తు చేసుకుంటారని, సంబంధిత భూములను రెవెన్యూ, గ్రౌండ్‌ వాటర్‌, రివర్‌ కన్జర్వేటర్‌, వ్యవసాయం, మైన్స్‌ శాఖల అధికారులు సభ్యులుగా ఉన్న జాయింట్‌ ఇన్స్పెక్షన్‌ కమిటీ పరిశీలించి ఆర్‌డిఒలకు పంపాలన్నారు. ఆయా పట్టా భూముల్లో ఇసుకను తవ్వడానికి కావలసిన అన్ని అనుమతులు వచ్చేలా జిల్లా మైన్స్‌ అధికారి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక వెలికితీత, రీచ్‌ల ఆపరేషన్‌, నిర్వహణ, టాక్స్‌ అన్నీ కలిపి ఖర్చు ఎంత మేరకు అవుతుందో తదుపరి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు.

➡️