ఫుట్పాత్ తొలగించకపోతే ప్రాణాలు పోతాయి  

May 11,2025 12:02 #ambedkar konaseema

-బెర్మ్ లు లేకుండా పుట్ పాత్.

  ప్రయాణికులు అవస్థలు

ప్రజాశక్తి-రాజోలు: జాతీయ రహదారి 216 రాజోలు మండలం సోంపల్లి నుండి రాజోలు వరుకు రహదారికి బర్ములు లేకుండా రహదారి కి ఆనుకుని సిమెంట్ కాంక్రీట్ తో పుట్ పాత్ నిర్మించారు.ఒక ప్రక్క పి.గన్నవరం ప్రధాన పంట కాలువ కు ఆనుకుని ఐరెన్ గ్రిల్ ఎర్పాటు చేయగా మరోపక్క బెర్ములు లేకుండా పుట్ పాత్ కట్టడాలు ప్రయాణికులకు శాపంగా మారాయి. రాజోలు జెడ్ టర్నింగ్ నుండి పొదలాడ వరకు ఉన్న కెనాల్ రోడ్ లో చెట్లను కొట్టి ఎక్కడి దుంగలు అక్కడే వదిలి వేయడంతో ప్రయాణీకులు భయం భయంగా ప్రయాణించాల్సిన పరిస్ధితి ఎర్పడింది. సహజంగా ఆ రోడ్డు గతంలో ఎన్నో ప్రమాదాలకు నిలయమైంది. దానికితోడు ఎన్ హెచ్ మరియు R&B అధికారుల నిర్లక్ష్యపు డిజైన్ వల్ల ఒకవైపు పుట్ పాత్, కెనాల్ వైపు బారికేడ్ నిర్మాణం తో రోడ్డు ఇరుకుగా మారి ఎదురెదురు వాహనాలు చాలా ఇబ్బందిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత వారం రోజుల క్రితం కాలువ వైపు చెట్లు నరికిన దుంగలు ఎక్కడికక్కడ వదిలివేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రయాణీకులు భయపడుతున్నారు. మండల స్థాయి,జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ ప్రముఖులు నిత్యం ప్రయాణించే ఈ మార్గంలోని ఇబ్బందులు వారి దృష్టిలో పడకపోవడం విచారించదగ్గ విషయం. దయచేసి సంభందిత అధికారులు దృష్టి సారించి దుంగలు తొలగించడమే కాకుండా కెనాల్ వైపు అన్ని ఆక్రమణలు తొలగించి ప్రయాణీకుల భయాందోళనలు తొలగించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

భారీ వాహనాలు ఎదురు పడితే అంతే…!

రాజోలు మండలం పొదలాడ నుండి రాజోలు వరుకు జాతీయ రహదారి 216 కు ప్రస్తుత ఎన్ హెచ్ అధికారులు బెర్ములు లేకుండా చేశారు. దీంతో రహదారి పై ఎదురెదురుగా వాహనాలు ప్రయాణిస్తే రహదారి కి బెర్మ్ లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఇక ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాలు ఎదురైనప్పుడు తప్పుకునేందుకు వీలు లేకుండా పుట్ పాత్ లు నిర్మించడంతో భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి రహదారికైనా నిబంధనల ప్రకారం రహదారికి ఇరువైపులా బెర్ములు నిర్మించాలి. అలాంటిది రాజోలులో జాతీయ రహదారికే బెర్ములు లేకుండా చేసి ప్రమాదాలకు కారణమవుతున్నారు‌.ఒన్ వే రహదారులలో నిర్మించే కట్టడాలు ఇరువైపులా ప్రయాణించే రహదారులకు ఆనుకుని నిర్మించడం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. లక్షలు వెచ్చించి రహదారులకు బెర్ములు లేకుండా పుట్ పాత్ నిర్మించి వాహనదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, బెర్ములు లేకుండా నిర్మించిన పుట్ పాత్ లను తొలగించి బెర్ములు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️