గోదావరి లంకలో చిరుతపులి..?

Sep 29,2024 22:21
గోదావరి లంకలో చిరుతపులి..?

ప్రజాశక్తి-రావులపాలెం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని నర్సరీల వద్ద కనిపించిందని చెబుతున్న చిరుతపులి తాజాగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిందని వదంతులు వ్యాపిస్తున్నాయి. రావులపాలెం గౌతమి గోదావరి లంకల్లో చిరుతపులిని చూసామని మత్స్యకారులు చెప్పడంతో అటవీ శాఖ జిల్లా అధికారి ఎంవి.ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆదివారం వెతుకులాట ప్రారంభించారు. ఊబలంకకు చెందిన మత్స్యకారులు గంగరాజు, వెంకటేశ్వరరావు నదిలో చేపల వేటకు వెళ్ళినపుడు చిరుతపులిని లంకల్లో చూశామని చెబుతున్నారు. తమ అన్వేషణలో చిరుతపులి ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా ప్రస్తుతానికి నిర్ధారణ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎఫ్‌ఒ ప్రసాదరావు చెప్పారు. చిరుత పాద ముద్రల కోసం అన్వేషిస్తామని తెలిపారు.తూర్పు గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం చిరుతపులి ఫోబియా పట్టుకుంది. సోషల్‌ మీడియాలో వేరు వేరు ప్రాంతాల్లో చిరుతపులి పాద ముద్రలు కనిపించాయంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఒక పక్క ఆందోళన, మరో పక్క అయోమయానికి గురవుతున్నారు. నిన్న రాత్రి ఆలమూరు, మండపేట ప్రాంతాల్లో చిరుతపులి దాడి చేసినట్టు ఒక వీడియో షేర్‌ అవుతుండగా, రావులపాలెం పరిసరాల్లో చిరుత పాద ముద్రలు కనిపించాయంటూ మరో పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై అటవీ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వడంతో పాటు, ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

➡️