చేనేత సహకార సంఘాల అభివృద్ధికి రుణాలు

Nov 29,2024 17:14
IMG-

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌

ప్రజాశక్తి – అమలాపురం

జిల్లాలో 19 చేనేత సహకార సంఘాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా క్యాష్‌ క్రెడిట్‌ రుణాల మంజూరు కోరుతూ రూ.13 కోట్ల16 లక్షలతో రూపొందించిన ప్రతిపాదనలకు కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌ కుమార్‌ కమిటీ సభ్యులు అనుమతితో ఆమోద ముద్ర వేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌ నందు జిల్లాస్థాయి చేనేత సహకార సంఘాల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి చేనేత సహకార సంఘాల అభివృద్ధి రుణాల కల్పన చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం వంటి పలు విషయాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి సంఘం ఆర్థిక పరిపుష్టికి రుణ పరపతిని కల్పిస్తూ చేనేత సంఘాల బలోపేతానికి చేనేత రంగాన్ని లాభదాయకంగా మార్చుకుని జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకునే విధంగా తమ వంతు భాగస్వామ్యం వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. మగ్గాలకు ఆధునిక సాంకేతికతను జోడించి ఉత్పాదకతను మరియు నాణ్యత తోపాటు సమయాన్ని ఆదా చేసుకునే విధంగా సంఘాలకు తోడ్పాటును అందించాలన్నారు. చేనేత వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులకు సంక్షేమానికి వివిధ దశల్లో అండగా నిలిచి చేనేత వృత్తిని లాభదాయకంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రభుత్వపరంగా భరోసాను కల్పించాలని కమిటీ సభ్యులకు సూచించారు. చేనేత వత్తిని జీవనాధారంగా చేసుకున్న చేనేత కార్మికులను సామర్థ్యాలను అంచనా వేస్తూ ఆ దిశగా ప్రభుత్వ రాయితీలతో ప్రోత్సహించాలని సూచిం చారు. జిల్లా వ్యాప్తంగా 9 మండలాల పరిధిలో 23 సొసైటీలు ఉన్నాయని వీటి అభివృద్ధికి సహకరిం చాలని ఆయన సూచించారు. పెట్టుబడి వ్యయం, రాబడి, నికర లాభాలను బేరీజు వేస్తూ చేనేత గిట్టుబాటు ధరలు కల్పన కొరకు మార్కెటింగ్‌ సౌలభ్యం కల్పించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఆధునిక పోకడలను మార్కెట్లో చేనేత వస్త్రాలపై ప్రస్తుతం ఉన్న అభిరుచులను పరిగణనలో తీసుకుని ఆ దిశగా పైలెట్‌ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తూ చేనేత రంగ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు కె.పెద్దిరాజు, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ, వీవర్స్‌ సర్వీసెస్‌ సంఘం విజయవాడ ప్రతినిధి నాగేశ్వరరావు, ఆర్‌డిడిడి బి.ధనుంజరు, ఆప్కో ప్రతినిధి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️