మహాధర్నా విజయవంతం

Nov 26,2024 23:45
IMG

కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు

ప్రజాశక్తి – అమలాపురం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈపిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద మంగళవారం సిఐటియు, ఎఐటియుసి, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నా విజయవంతమైంది. ఈ మహాధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.బలరాం, జి.దుర్గాప్రసాద్‌, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి సత్తిరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అయినా తమ విధానాల్లో మార్పు లేదని స్పష్టంగా ప్రకటించిందన్నారు. కుక్కతోక వంకరని మరోసారి మోడీ ప్రభుత్వం రుజువు చేసుకుందన్నారు. ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్న టిడిపి, జనసేన ప్రభుత్వాలు రాష్ట్రంలో అదే విధానాలను అమలు చేస్తున్నాయని వారు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లోనూ ఈ నిరసన వెల్లువ సాగుతోందని వారు తెలిపారు. సర్వ సంపదలు సృష్టించేది కార్మికవర్గం, ప్రజలకు తిండిపెట్టేది రైతాంగం కాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతి రేకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లు పెట్టుబడిదారులకు అనుకూలమన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.19.28 లక్షల కోట్ల రుణమాఫీ, పన్ను రాయితీ, ప్రోత్సాహాల పేరుతో ప్రజల ధనాన్ని దోచిపెట్టి కార్పొరేట్లకు కట్టబెడుతుందని వాపో యారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌తో సహా భారీ పరిశ్రమలు, గనులు, సముద్రతీరాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు బిజెపి ప్రభుత్వం కట్టబెడుతోందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రయివేటు అమ్ముతాం లేదా మూసివేస్తాం అనే విధానాన్ని బిజెపి అమలుచేస్తోందన్నారు. . ఈ సంవత్సరం బడ్జెట్లో 500 ప్రయివేటు కంపెనీలకు యాజమాన్యం ఇవ్వవల్సిన జీతాలు కేంద్ర ప్రభుత్వమే ఇంటర్నెట్‌ షిప్‌ పేరుతో కార్మికుడికి నెలకు రూ.5వేలు ప్రోత్సాహాలను అమలుచేస్తున్నదన్నారు. కార్మి కులకు నెలకు ఇవ్వవల్సిన రూ.26వేల కనీసవేతనాన్ని ఇవ్వడంలేదని అన్నారు. ఎఐటియుసి పూర్వ జిల్లా అధ్యక్షులు కె.సత్తిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ట్రెజరర్‌ కె.కృష్ణవేణి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి మలకా సుభాషిణి మాట్లాడుతూ కనీస వేతనం ఏమాత్రం పెంచలేదన్నారు. కాని ధరలు రెట్టింపుగా పెరిగాయన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా స్కీం కార్మికులు అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ‘కార్మికులుగా’ గుర్తించడంలేదని వాపోయారు. కార్మికులు ఎంత కాలం పనిచేసినా పర్మినెంట్‌ చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్సోర్స్‌, ట్రయినీ, గౌరవ వేతనం లాంటి పేర్లతో కార్మికులను అత్యంత దోపిడి చేస్తున్నారన్నారు. కడుపుమండి కార్మికులు తిరగ బడతారని పెట్టుబడిదారులకు తెలుసని అందుకే 29 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా కేంద్రం మార్చిందని వాపోయారు. స్వాతంత్య్రం ముందు నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల సారాన్ని పిండి కార్మికులను బానిసలుగా పనిచేయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రచేస్తున్నాయన్నారు. లేబర్‌ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ దేశమైన భారతదేశంలో కార్మిక వర్గం దీనిని అడ్డుకోవాలన్నారు. రైతులతో కలిసి ఐక్యంగా పోరాడితేనే మన లక్ష్యం సాధించగలమని 2021 లో రైతుల చారిత్రాత్మక పోరాట ఫలితంగా మూడు రైతు నల్ల చట్టాలు రద్దుఅయ్యాయని అన్నారు. కాని డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయడంలేదన్నారు. లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలకు పట్టడంలేదని వాపోయారు. ఉపాధి చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచి ఈ సంవత్సరం 6 కోట్ల మంది లబ్దిదారులను తగ్గించిందన్నారు. ఉపాధి హామీకి నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కార్మిక వర్గాన్ని చీల్చాలని బిజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నిరంతరం ప్రయత్నిస్తున్నాయన్నారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడమే మన మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎదిరించాలి. ఈ విధానాలను ప్రతిఘటించడం ఒక్కటే మన ముందున్న పరిష్కార మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు నిమ్మ కాయల వెంకటేష్‌, పొలమూరి శ్రీనివాసరావు, ఊటాల వెంకటేష్‌, సిహెచ్‌.శ్రీనివాసరావు, నిమ్మకాయల శ్రీనివాస రావు, బండి వెంకటలక్ష్మి, బుంగ సత్యనారాయణ, బండి ఈశ్వరి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️