ప్రజాశక్తి-రాజోలు సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన ఒక మహిళకు ప్లేట్‌లెట్లు 20 వేలకు పడిపోయినట్లు తెలిసింది. చికిత్సతోపాటు ప్లేట్‌లెట్లు ఎక్కించేందుకు రూ.50 వేల వరకు ఖర్చవుతుందని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చెప్పారు. స్తోమత లేక అమలాపురం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ ప్లేట్లెట్లు లేవని బయట ల్యాబ్‌లో కొనుగోలు చేయాలని రూ.14 వేలు ఖర్చవుతుందని చెప్పారు. ఉచితంగా చికిత్స చేస్తారని ఇక్కడికి తీసుకువచ్చామని కుటుంబసభ్యులు చెప్పగా ప్లేట్లెట్లు తీసుకొస్తే వైద్యం చేస్తాం అన్నారు. రాజోలుకు చెందిన ఒక వ్యక్తికి డెంగీ రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్లేట్లెట్లు 17 వేలకు పడిపోయాయని చెప్పారు. ప్లేట్లెట్లు ఎక్కించి రూ.30 వేలు బిల్లు చేశారు. చికిత్స, ఐసియు ఛార్జీలకు మరో రూ.70 వేలు వసూలు చేసి ఇంటికి పంపించారు. నీరసం తగ్గకపోవటంతో మరుసటి రోజు మరో ప్రైవేటు ఆసుపత్రిలో ప్లేట్లెట్లు పరీక్ష చేయంచగా 17 వేలే ఉన్నాయి. ప్లేట్లెట్ల బదులు ప్లాస్మా ఎక్కించి మోసం చేశారని వైద్యుని ద్వారా తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినా చిన్నచిన్న జబ్బులు చేసినా స్థానిక ప్రైవేట్ వైద్యులే చికిత్స చేసి తక్కువ ఖర్చుతో ప్రాణాలను కాపాడేవారు. అందుకే వారిని ప్రజలు దేవుడితో సమానంగా భావించేవారు. కానీ రానురాను ఆ పరిస్థితి మారిపోతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలే కాక పట్టణ ప్రాంతాల్లోని వీధులే లక్ష్యంగా చేసుకుని మెడికల్ మార్కెటింగ్ వ్యవస్థ మాఫియాలా మారిపోతోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆర్‌ఎంపి, పిఎంపిలను లక్ష్యంగా చేసుకుని ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఆఫర్ల మైకంలో పడిన కొందరు ఆర్‌ఎంపి, పిఎంపిలు అడ్డదారులు తొక్కుతూ అనైతిక వ్యవహారాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా సామాన్యులు ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా నష్టపోతున్నారు.ఒక్కప్పుడు జిల్లా కేంద్రాల్లో ఉండే కార్పొరేట్ ఆసుపత్రులు తమకంటూ ప్రత్యేకంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేవి. వివిధ జబ్బులతో బాధపడేవారిని తమ వద్దకు రిఫర్ చేయాలంటూ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులను కోరేది. అలా ఆసుపత్రుల మధ్య పోటీ పెరిగి చివరకు జిల్లా కేంద్రాల నుంచి గ్రామాల వరకు మెడికల్ మార్కెటింగ్ వ్యవస్థ విస్తరించింది. చిన్న, పెద్ద, కొత్త, పాత తేడా లేకుండా వ్యాధిగ్రస్తులను రిఫర్ చేసిన ఆర్‌ఎంపి, పిఎంపిలకు ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్యాకేజీలను ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా అమలాపురం, రాజమండ్రి, కాకినాడలో ఉన్న పలు ప్రైవేట్ ఆసుపత్రులు బంపర్ ఆఫర్‌లు ఇస్తున్నాయి. ఈ బంపర్ ఆఫర్‌లు ప్యాకేజీలు అనేక రకాలుగా ఉంటున్నాయి. ఆర్‌ఎంపి, పిఎంపిలు పంపిన వారు ఇన్‌పేషెంట్‌గా చేరితే ఆ రోగికి చెల్లించే ఫీజులో 30 శాతం, వివిధ టెస్టులకు సంబంధించి వేసే బిల్లుల్లో 50 శాతం వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. కొన్ని కొత్త ఆసుపత్రులయితే నిలదొక్కుకునేందుకు ఔట్‌పేషంట్ విభాగంలోనూ ఆఫర్‌లు అందిస్తున్నాయి. ఒక నిర్ణీత సమయంలో లక్ష్యానికి మించి రోగులను రిఫర్ చేసినట్లయితే విదేశాలకు టూర్లను కూడా ఆఫర్ చేస్తున్నారు.వ్యాపారంగా మారిన వైద్యం…!వైద్యం పక్కా వ్యాపారంగా తయారైంది. వైద్యం కోసం ఆసుపత్రి స్థాపించి రోగులకు సేవలు అందించే కాలం నుంచి ప్రస్తుతం అరువు వైద్యులను నియమించుకుని, ఆర్‌ఎంపిలు, పిఎంపిలు, అంబులెన్స్ డ్రైవర్‌లు, పిఆర్‌ఒల సాయంతో వ్యాపారం చేసే పరిస్థితులకు దిగజారాయి. చిన్న జ్వరం వచ్చినా.. ఇష్టారీతిన రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తూ లేని రోగం అంటగడతూ వైద్యం చేసే స్థాయికి ఎదిగాయి. రోగి బాధను, భయాన్ని క్యాష్ చేసుకునే వ్యాపారం ప్రణాళికబద్ధంగా సాగుతోంది. కొత్తగా ఏర్పాటైన ఆసుపత్రుల నుంచి అంతో ఇంతో పేరున్న హాస్పిటళ్ల వరకు గ్రామాలు, పట్టణాల్లో మెడికల్ ప్రాక్టీషనర్లపైనే ఆధారపడి వ్యాపారం సాగిస్తున్నాయి. రోగి చెల్లించే ఫీజుల నుంచి సుమారు 30 నుంచి వరకు కమీషన్లు ఇస్తున్నాయి. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఒకరిద్దరు ఆర్‌ఎంపి, పిఎంపిలుకలిసి అరువు వైద్యులతో పేదరోగుల నుంచి పెద్ద దోపిడీ చేస్తున్నారు. గ్రామాల నుంచి రోగిని తీసుకొస్తే చాలు నీకింత.. నాకింత. అనేధోరణిలో వైద్యవ్యాపారం జోరుగా సాగుతోంది. రాజోలు నియోజకవర్గంలో సుమారు 30 ఆసుపత్రులు ఉన్నాయి. వీటికి అనుగుణంగా సుమారు 120 మంది ఆర్‌ంపిలు ఉన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి తమకు ఇష్టం వచ్చిన ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ రోగుల వద్ద డబ్బులు దండుకుంటున్నారు. గతంలో ఆసుపత్రిలో ఫీజుల నెల రోజులకు రూ.100 ఉండేది. కరోనా వచ్చిన తరువాత వారం రోజులకు రూ.200,రూ 300 వసూలు చేస్తున్నారు. గతంలో వారంరోజులు ఆసుపత్రిలో ఉంటే రూ.10 వేలు ఖర్చు అయ్యేంది. ఇప్పుడు రూ.30 వేల పైన బిల్లులు వేసి ప్రజల సొమ్మును దోచేస్తున్నారు. సామర్థ్యానికి మించి..!నిబంధనల ప్రకారం ఆర్‌ఎంపిలు ప్రథమ చికిత్స వరకే పరిమితం అవ్వాలి. సర్టిఫైడ్ డాక్టర్ సూచించిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా సెలైన్ పెట్టడం, మందులు ఇవ్వడం, ఇంజెక్షన్ వేయడం వంటి సేవలు చేయవచ్చు. నేరుగా పరీక్షించడం, రోగ నిర్ధారణ చేయడం మందులు ఇవ్వడం చేయకూడదు. కానీ ఈ నిబంధన అమలు కావడం లేదు. జాడలేని బిల్లులుమందుల అమ్మకాలకు సంబంధించి బిల్లులను కొనుగోలుదారులకు ఇవ్వాలి. కానీ దుకాణ యజమానులు ఈ నిబంధనను పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే వారి షాపునకు సంబంధించిన లెటర్‌హెడ్‌పై రాసి ఇస్తున్నారు. బిల్‌బుక్ రసీదులను చాలా తక్కువ సందార్భాల్లోనే ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మందుల నిల్వలు, అమ్మకాలను కూడా రిజస్టర్‌లో నమోదు చేయాల్సి ఉండగా అలా చేయడం లేదని తెలుస్తోంది. వ్యాపారులు కొనుగోలు చేసిన మందుల రికార్డులను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని సమాచారం. కొన్ని రకాల మందులను ఫ్రిజ్‌లో పెట్టాల్సి ఉండగా వాటిని బయట ఉంచుతున్నారు. మెడ్ ప్లస్, అపోలో మెడికల్ షాపులలో మినహా మిగిలిన మందుల షాపులలో బిల్లులు ఇవ్వడం లేదు. ఇంత జరుగుతున్నా పూర్తిస్థాయిలో అధికారులు మెడికల్ దుకాణాలపై శ్రద్ధ చూపడంలేదని పలువురి ఆరోపిస్తున్నారు.