ప్రజాశక్తి – రాజోలునిత్యం కడలితో సహవాసం చేస్తూ.. నడి సంద్రాన ఆశల వల విసురుతూ బతుకుపోరు సాగించే మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే మత్స్యకార భరోసా నగదు ఈ ఏడాది ఇంత వరకు వారికి అందలేదు. గత ప్రభుత్వానికన్నా రెట్టింపు నగదు ఇస్తామని హామీలు గుప్పించి గద్దెనెక్కిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా దానిపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో జిల్లాలో వేలాది మంది మత్స్యకారులు నూతన ప్రభుత్వం పెంచిన భరోసా కోసం కోసం గంపెడు ఆశతో కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.వేట నిషేధంలో ఇవ్వాల్సిన భరోసా…!చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందించాల్సిన పరిహారం కోసం మత్స్యకారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. సముద్రంలో వివిధ రకాల చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలంగా భావించి ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు సుమారు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. చేపల వేట విరామ కాలంలో మత్స్యకారులను ఆర్థికంగా ఆదు కొనేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాదీ మే నెల రెండో వారంలో మత్స్యకార భరోసా పథకం పేరుతో అర్హత గల ప్రతి మత్స్యకారుడికి రూ.10 వేలు వంతున వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేది. అయితే ఈ ఏడాది 2024-25 ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో మత్స్య కారులు ఇబ్బందులు పడు తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడం భరోసా రు.20 వేల హమీ ఇవ్వడంతో ఈ ఏడాది భరోసా రూ.10 వేలు ఇస్తారా? లేక హమీ ప్రకారం రూ.20 వేలు ఇస్తా అనే చర్చ మత్స్యకారుల్లో ఉంది. వేట నిషేధ కాలానికి ఆర్థిక భరోసాగా వైసిపి ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వగా, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. దీంతో మత్స్యకార భరోసా ఎప్పుడు ఇస్తారోనని 5 నెలలుగా మత్స్యకారులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.11,305 మంది లబ్ధిదారులు ఎదురు చూపు…!అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 93 కిలోమీటర్ల తీరం ఉంది. ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో ఈ ఏడాది వేట నిషేధ బృతి కోసం 11,305 మందిని గుర్తించారు. సుమారు 1,931 బోట్లను వీరు వినియోగిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మత్స్యకార భరోసా బృతి కింద ప్రతి కుటుంబానికీ రూ.10 వేల వంతున అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే నెల 13న పోలింగ్ పూర్తయిన వెంటనే మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు జమ కాలేదు. జూన్ 4న ఓట్ల లెక్కింపు అయి ప్రభుత్వం మారింది. నూతన ప్రభుత్వం మారి ఐదు నెలలు గడిచినా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం మత్స్య కారుల భరోసా రూ.10 వేల నుండి మరో రూ.పది వేలు పెంచి రూ.20 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం హమీపై గంగ పుత్రులు గంపెడాశతో ఎదురుచుస్తున్నారు. చేపల వేట సరిగా లేక ఇబ్బంది పడుతున్న మత్స్యకారులు సక్రమంగా సాగని చేపల వేటప్రకతి వైపరీత్యాలు, సోనాబోట్ల తాకిడితో కొద్ది నెలలుగా చేపల వేట ఆశాజనకంగా లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదున్నర నెలల కాలంలో కేవలం నెలరోజులు మాత్రమే చేపల వేట సక్రమంగా సాగిందని మత్స్యకారులు చెబుతున్నారు. సుమారు 2 నెలల పాటు ప్రకతి వైపరీత్యాలతో చేపల వేటకు వెళ్లొద్దని ఆంక్షలు విధించగా, మిగిలిన రోజులు వేటకు వెళితే డీజిల్ ఖర్చులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
