లే అవుట్‌ పూడికతో రోడ్లు ఛిద్రం

Oct 11,2024 17:14 #heavy load, #lay out, #lorries, #roads

ప్రజాశక్తి, రావులపాలెం:   అధిక లోడుతో గ్రావెల్‌ లారీలు రవాణా జరుతుండటంతో రోడ్లుకు గుంతలు ఏర్పడి ఛిద్రం అవుతున్నాయి. మండలపరిధి పొడగట్లపల్లి శివారు లక్ష్మీపాలెం చేరువలో పంటపొలాలు పూడ్చి లేఅవుట్‌ వేస్తున్నారు.  లారీల్లో భారీ లోడుతో గ్రావెల్‌ రవాణా వల్ల గ్రామ ప్రధాన రహదారికి గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షాలు కారణంగా రోడ్డు పై గుంతల్లో నీరు ప్రవహిస్తుండటంతో గ్రామ ప్రజలు ప్రయాణం చేయడానికి వణికిపోతున్నారు. లే అవుట్‌ నిర్వాహకులు రోడ్డు పై పెద్ద పెద్ద రాళ్ళు పరచటం మూలంగా వాహన చోదకులు ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామ ప్రజలు, విద్యార్థులు,కార్మికులు, కర్షకులు నిత్యం ఆ రహదారి వెంబడి వెళ్లాల్సి ఉంది. రోడ్డుపై వెళ్లాలంటే అరచేతిలో ప్రాణం పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. లారీల  అధిక లోడుతో  వెళుతున్న లారీలతో    మంచి నీరు సరఫరా చేసే పైపులైన్లు పగిలి త్రాగునీటి సమస్య ఏర్పడుతోంది.  అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.  అధికారులు తగిన  చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️