అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ మహేష్ కుమార్
ప్రజాశక్తి – అమలాపురం
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్, జాప్యాలు, సమస్యలు పరిష్కరించే దిశగా ఈదరపల్లి వద్ద నూతన వంతెన నిర్మాణం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు వివిధ శాఖల అధికారులతో సమావేశమై వంతెనకు ఇరువైపులా ప్రస్తుతం ఉన్న ఆక్రమణలను తొలగించ డానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జటిలమవుతున్న నేపథ్యంలో కనీసం అంబులెన్స్ వెళ్లాలన్నా ఈ వంతెన వద్ద కష్టతరంగా మారిందని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ ఉండటంతో పట్టణ వాసులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి తక్షణమే కలెక్టరేట్ నుంచి రూ. 2 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రగతికి నోచుకోని రహదారులు కూడళ్లు వంతెనలు మూలంగా ట్రాఫిక్ సమస్య జఠిల మవుతోందన్నారు. నూతనంగా ఏర్పడిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో పురాతనమైన వంతెనలు ఉండడంతో ఈ వంతెనలు జిల్లా కేంద్రం స్థాయి ట్రాఫిక్ రద్దీకి తగ్గట్టుగా లేని దృష్ట్యా వీటిని విస్తరింప చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎన్నో ఏళ్లకాలం క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన వంతెనలపైనే ప్రస్తుతం రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ సమస్య తీవ్రతరమైనదని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ అనేది రోడ్లు పై పెరుగుతున్న వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ జాప్యాల సమస్యలను సూచిస్తుందన్నారు. ఇటీవల జిల్లా కేంద్రం అయిన నేపథ్యంలో ఆ స్థాయికి తగ్గ రాకపోకలకు అనువైన రహదారులు వంతెనలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అధిక పరిమాణంలో వాహనాలు కారణంగా సమస్య ఉత్పన్నం అవుతుందని, వాహన కమ్యూనికేషన్లు డేటా ట్రాన్స్ మిషన్‌ను ఉపయోగిం చుకునే అనుకూల ట్రాఫిక్ సిగల్ నియంత్రణ వ్యూహాల ద్వారా పరిష్కరించడానికి దశల వారీగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్‌డిఒ కె.మాధవి రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ బి.రాము, జల వనరుల శాఖ డిఇ బి.శ్రీనివాస రావు ట్రాన్స్‌కో ఎస్‌ఇ ఎస్.రాజబాబు, మున్సిపల్ కమిషనర్ కెవివిఆర్. రాజు తదితరులతో కమిటీ వేశారు. మీరు ఆక్రమణలను గుర్తించడంతో పాటు ఆక్రమిత స్థలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు షాపులను తొలగించడానికి నివేదిక రూపొందించిన ఎడల తదుపరి తొలగింపునకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఒ కె.కాశీవిశ్వేశ్వరరావు, వివిధ శాఖలకు చెందిన ఇంజినీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.