అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ మహేష్ కుమార్
ప్రజాశక్తి – అమలాపురం
కోటిపల్లి – నర్సాపురం రైల్వేలైన్‌లో భాగంగా భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో రైల్వే లైన్ నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ రైల్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ కు సంబంధించి రైల్వే లైన్ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ రెవెన్యూ రైల్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో రైల్వే లైన్లో భాగంగా భూ సేకరణ పూర్తయిన ప్రాంతాల లోని భూమిని రైల్వే అధికారులు స్వాధీన పరుచుకొని రైల్వే నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అయినవిల్లి మండలంలోని శానపల్లి లంక ,సిరిపల్లి, మాగం, అమలాపురం రూరల్ మండలంలోని ఎ.వేమ వరం, భట్నవిల్లి గ్రామాలలో రైల్వే లైనుకు సంబం ధించి భూసే కరణ పూర్తయిందని రైల్వే అధికారులు గ్రామానికి ఒక ప్రత్యేక బృందాలను పంపి నిర్మాణ పనులను ప్రారంభిం చాలన్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాలలో భూ సేకరణ పూర్తయిన భూములను సర్వే చేసి హద్దుల ను గుర్తించి రైల్వే అధికారులకు అప్పగించాలన్నారు. సంబంధిత ప్రాంతాలలోని రైతులు తదుపరి పంట వేసేలోపు రైల్వే అధికారులు భూసేకరణ పూర్తయిన భూములను తమ ఆధీనంలోకి తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. రైల్వే లైన్ నిర్మాణం లో భాగంగా భూ సేకరణ విషయంలో కోర్టు పరిధిలో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కోనసీమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే లైన్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులందరూ సమన్వ యంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమ ంలో జెసి టి.నిషాంతి, దక్షిణ మధ్య రైల్వే, ఉప ముఖ్య ఇంజినీరు ఎ. బద్దియ్య, అమలాపురం, కొత్త పేట రెవెన్యూ డివిజనల్ అధికారులు కె.మాధవి, శ్రీకర్, గ్రామీణ నీటి సరఫరా కార్యనిర్వాహక ఇంజినీరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.