ప్రజాశక్తి-అమలాపురం తమ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని కుసుమవారి పేట శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ కుసుమవారి పేట శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసులు ఎదురుగా ఉన్న ఎజి రోడ్‌లో పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన అంబటి కోటేష్ కొంత కాలంగా పీచు ఫ్యాక్టరీ నడుపుతున్నారు. వారి ఫ్యాక్టరీకి చెందిన రోడ్డు పక్కనే గల ఖాళీ స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి నిర్మాణ పనులు ప్రారంభించారు. శ్రీవెంకటేశ్వర కాలనీలో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక అంగన్‌వాడీ కేంద్రం, ఒక ప్రార్థనా మందిరం మెయిన్ రోడ్డు పక్కన రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ విగ్రహం ఉన్నాయి. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం చదువుకునే విద్యార్థులపైన కాలేజీలకు వెళ్ళే యువతీ యువకులు, కూలి పనులు చేసే మహిళలపై పడుతుందని, అధికారులు కలుగజేసుకుని మద్యం దుకాణం నిర్మాణం పనులు నిలుపుదల చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాల్లో సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, దళిత సంఘాల నాయకులు బొంతు రమణ, గిడ్ల వెంకటేశ్వరరావు, మెండి డేవిడ్ అంబేద్కర్, జల్లి శ్రీనివాసరావు కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, గెల్ల రాజేంద్ర, సాపే రమేష్, జల్లి నరేష్ పాల్గొన్నారు.
