ప్రజాశక్తి – ఆలమూరు : అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చెడియమ్మ, చాల పెద్దమ్మ అయిన చింతలూరు శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ఫాల్గుణ బహుళ చతుర్దశి, అమావాస్య, చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) మూడు రోజులపాటు ప్రముఖంగాను, నెల రోజులకు పైగా జరిగే తీర్ధానికి లక్షలాదిగా దేశ నలుమూలల నుండి యాత్రికులు తరలివచ్చే ఈ ఉత్సవాల పనుల ప్రారంభానికి మాఘ బహుళ చవితి ఆదివారం నాడు సంకటహర చతుర్థి సందర్భంగా ఆలయంలో గ్రామ పెద్దల సమక్షంలో విఘ్నేశ్వర పూజ నిర్వహించిన దేవస్థానం ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి, ఆలయ అర్చకులు, ఆసాదులు, శుభ ముహూర్తం చేశారు. ఉత్సవాల పనులన్నీ వేగవంతం చేస్తామని యాత్రికులకు ఏ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడానికి పూనుకొంటున్నట్లు దేవస్థానం ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి తెలిపారు.
